28-11-2025 12:00:00 AM
ఉమ్మడి జిల్లాలో మొదలైన నామినేషన్లు పర్వం
ఆదిలాబాద్, నవంబర్ 27 (విజయక్రాం తి): ఎప్పుడేప్పుడా అని ఎదురుచూ స్తున్న పంచాయితీ ఎన్నికల సందడి ఉమ్మడి జిల్లాలో గురువారం ఆట్టహాసంగా మొదలైంది. ఆదిలాబాద్‌జిల్లా వ్యాప్తంగా 20 మం డలాల్లో 473 పంచాయతీలు, 3,870 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మూడు విడుతలుగా నిర్వహించే ఎన్నికల్లో బాగంగా తొలి విడతగా 6 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినే షన్ల పర్వం గురువారం మొదలైంది. ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులు, సిబ్బందిని నియమించింది. తొలి విడతలో ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీలు, 1390 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి రోజు సందడి షురూ..
గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం ఎట్టకేలకు నిర్వహించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఎన్నికల సంఘం ఈనెల 25న నోటిఫికేషన్ జారీ చేయడం.. గురువారం నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తోంది. తొలి రోజున ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీ ల్లో సర్పంచ్ అభ్యర్తిత్వం కోసం 32 నామినేషన్లు దాఖలు కాగా 1,390 వార్డులకు గాను 15 నామినేషన్లు దాఖలాయ్యాయి.
పల్లెల్లో కోలాహలం ...
స్థానిక సమరం ప్రారంభం కావడంతో పల్లెల్లో కోలాహలం నెలకొంది. పోటీ దారులతో పాటు వారి మద్దతు దారులు బిజీ బిజీ గా కనిపిస్తున్నారు. నామినేషన్లకు అవసరమైన పత్రాలు సేకరించడంతో పాటు ఈ వార్డులో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించి రెవెన్యూ కార్యాలయాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు తీయడం.. ఇంటి ట్యాక్స్ చెల్లింపులు చేయడం వంటి ప్రక్రియలు చేపడుతున్నారు.
మరోపక్క నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు గ్రామా ల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్తిస్తున్నారు. తనకే మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి పల్లెల్లో ఎన్నికల సందడి వాతావరణం కనిపిస్తోంది.
నామినేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి): రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాంకిడి, జంబుల్ ధరి గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ పత్రాలను పరిశీలించి స్టేజ్ 1 రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అలాగే జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్‌లో మీడియా సెంటర్‌ను గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు వి. శ్రీనివాస్, వ్యయ పరిశీలకులు బి.స్వప్న, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ప్రారంభించారు.
నామినేషన్ల ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలి: కలెక్టర్ అభిలాష
ఖానాపూర్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని అన్నారు. నామినేషన్ల దాఖలుకు అవసరమయ్యే పత్రాలు, వివరాలను వారికి వివరించాలని చెప్పారు.
రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తనిఖీలో తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీఓ రత్నాకర్, ఎన్నికల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు
లక్షెట్టిపేట, నవంబర్ 27 : 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి, సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి, అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ, చందారం, హనుమంతుపల్లి, రంగపేట గ్రామాలకు చందారం గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేష న్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్, సహా య రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొద టి విడతలో 90 సర్పంచ్, 816 వార్డు సభ్యు ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సం ఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటిక్యాల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన పోస్ట్ మార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రతి ఒక్కరి సహకారం అవసరం:కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి) : జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ లో ఎఫ్‌ఎస్టి ఎస్‌ఎస్టి బృందాలతో కలెక్టర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు.అనంతరం కలెక్టర్, ఎస్పీ కలిసి FST వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని అన్నారు. ఎన్నికల ప్రచార పత్రాల్లో ప్రింటింగ్, ప్రెస్ వివరాలు తప్పనిసరిగా ఉండాలని ప్రెస్ యజమానులకు సూచించారు. ప్రజలు 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకవెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీపీఓ రమేష్ పాల్గొన్నారు.
ఎన్నికలవేళ.. నిర్బంధ తనిఖీలు
నిర్మల్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించి వచ్చేనెల 11 13,17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేస్తూ పోలీస్ శాఖ నిర్బంధ తనిఖీలను నిర్వహిస్తున్నారు నిర్మల్ జిల్లాలో మొత్తం 400 జిపి లతోపాటు 3368 వార్డు మెంబర్లకు మూడు విడుదలగా ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ డిపిఓ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏఎస్పీలు రాకేష్ మీనా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభ కావడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలకు జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు మద్యం ఇతర ప్రలోభవలకు ఓటర్లు లొంగకుండా నియంత్రణ చర్యలు బాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో దీనికి తోడు గోదావరి నది ఉండడంతో ప్రధాన రహదారులు అంతర్రాష్ట్ర గ్రామాల వద్ద ఉన్న రహదారులపై చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు.
జిల్లాలో మొత్తం నాలుగు ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు ఏర్పాటు చేయగా 8 ఇంటర్ డిస్టిక్ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. సారంగాపూర్ మండలంలోని రామ్ సింగ్ తండా కుబీర్ మండలంలోని సిరిపెల్లి సేవాలాల్ తండా దొడ్డర్నా తండా కుంటాల మండలం లోని దవనల్లి తాండ తాండూరు మండలంలోని బేల్ తరోడ జోల కి చెక్ పోస్ట్ లు ఏర్పడి చేయగా ఇంటర్ డిస్టిక్ చెక్పోస్టులో భాదనకుర్తి బాసర పాండవాపూర్ గంజాల్ గ్రామాల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.
ఇక్కడ ప్రతిరోజు మూడు షిఫ్టుల్లో అధికారులు వచ్చిపోయే వాహనాలను నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగదు మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి ఆధార్ కార్డుతో వారి విరువాలను నమోదు చేసు కుంటున్నారు.
గత ఎన్నికల్లో గొడవలు దాడులకు పాల్పడ్డ కేసులు నమోదైన వారిని తాసిల్దార్ కార్యాలయం ముందు బైండోవర్ చేస్తున్నారు. సమస్యత్మక ప్రాంతాల్లో అడవుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎలాంటి పొరపాటు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
ఎన్నికల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్
నస్పూర్, నవంబర్ 27 : సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమా చారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి విడత ఎన్నికలలో 90 సర్పంచ్, 816 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్, స్టాటిస్టిక్,
వీడియో సర్వేయలెన్స్ బృందాలు, ఎం సి ఎం సి, ఎం సి సి, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ బృందాలను, ఎన్నికల అధికారులను నియమించమన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర ప్రభావిత అంశాలపై నిఘా పెట్టామని, ఈ అంశాలు ఎవరి దృష్టికి వచ్చినా కంట్రోల్ రూమ్ (08736- 250501)లో ఫిర్యాదు చేయవచ్చని, ఇతర ఎన్నికల సంబంధిత సమాచారం కోసం సంప్రదించాలని కోరారు.