calender_icon.png 28 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనావాసాల మధ్య ‘మద్యం’

28-11-2025 12:43:03 AM

  1. స్థానికుల అభ్యంతరాలు 

హైకోర్టు చివాట్లు 

అయినా పట్టించుకోని ఎక్సుజ్ అధికారులు 

1వ తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం

మేడ్చల్, నవంబర్ 27(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో జనావాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటు పై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. తమ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని అనేక చోట్ల స్థానికులు ఎక్సుజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

అయినప్పటికీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఎన్ని అభ్యంతరాలు ఉన్నా మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. ఇటీవల మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ పూర్తయింది.  డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. గతంలో ఉన్నచోటనే మద్యం దుకాణాలు ఏర్పాటు అవుతున్నాయని ఎక్సుజ్ అధికారులు పేర్కొంటున్నప్పటికీ అప్పటి, ఇప్పటి పరిస్థితులు వేరు.

గతంలో శివారులో ఉండగా, ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో చుట్టుపక్కల నివాస గృహాలు ఏర్పాటయ్యాయి. మందుబాబులు మద్యం మత్తులో సమీపంలోనే మూత్రం చేస్తున్నారని, ఖాళీ బాటిళ్లు పగలగొడుతున్నారని, ఆహార పదార్థాలు పడేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అంతేగాక మద్యం దుకాణం ముందు నుంచి రోడ్డు మీద మహిళలు నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రోడ్డుమీద వాహనాలు పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 

చకాచకా ఏర్పాట్లు...

ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ కొత్త మద్యం దుకాణాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో రెండు ఎక్సుజ్ సూపరిండెంట్ కార్యాలయాలు ఉన్నాయి. మేడ్చల్ యూనిట్ పరిధిలో 118, మల్కాజిగిరి యూనిట్ పరిధిలో 88 మద్యం దుకాణాలకు గత నెలలో టెండర్ వేశారు. దుకాణం దక్కించుకున్న వారు అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జనావాసాలకు దూరంగా, ఆలయాలకు, విద్యాసంస్థలకు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలి. కొన్నిచోట్ల మందిరాలకు దగ్గరలో ఏర్పాటు చేస్తున్నారు. ఎండోమెంట్ లో రిజిస్టర్ అయిన మందిరాల కు మాత్రమే 100 మీటర్ల దూరం నిబంధన వర్తిస్తుందని ఎక్సుజ్ అధికారులు చెబుతున్నారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన స్థానికులు 

జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని తమ అభ్యంతరాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నాగారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సత్యనారాయణ కాలనీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. రాష్ర్టంలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎక్సుజ్ అధికారులకు, దుకాణదారులకు నోటీసు జారీ చేసింది. 

ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మద్యం దుకాణంతో ఇబ్బందులు 

ఈస్ట్ ఆనంద్ బాగలోని 9వ నంబర్ మద్యం దుకాణం వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అనేకసార్లు ఎక్సుజ్ అధికారులకు, కలెక్టర్ కు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేద ని స్థానికులు తెలిపారు. కొత్త దుకాణం ఏర్పాటు పై ఇటీవల ప్రజావాణిలో మళ్లీ ఫిర్యాదు చేశారు. మందుబాబులు న్యూసెన్స్ చేస్తున్నారని, మద్యం షాపు ముందు పార్కింగ్ లేకపోవడంతో ఇతరుల దుకాణాల ముందు పార్కింగ్ చేసి గొడవకు దిగుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో ఫిర్యాదులు చేశామని మళ్లీ అదే చోట అనుమతినిచ్చారని తెలిపారు.

మద్యం దుకాణం ఏర్పాటుచేసిన భవనానికి వాణిజ్య అనుమతి లేదని తెలిపారు. రోడ్డుమీద పాన్ షాప్ ఏర్పాటు చేసి మద్యం దుకాణదారులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. మద్యం దుకాణం తరలించాలని వారు కోరారు. ఉప్పల్ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఇటీవల స్థానికులు ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ ఎక్సుజ్ అధికారులు ప్రజల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.