అబ్బో.. ఆ 14 నెలలు
న్యూయార్క్: రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని మార్చేసిందని టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. తీవ్రమైన నొప్పితో కొన్ని నెలల పాటు నరకయాతన అనుభవిం చానని తెలిపాడు. ప్రమాదంతో 14 నెలల పాటు క్రికెట్‌కు దూరమైన పంత్ ఇటీవలే ఐపీఎల్ 17వ సీజన్‌లో అదరగొట్టాడు. 13 మ్యాచ్‌ల్లో 155.40 స్ట్రయిక్‌రేట్‌తో 446 పరుగులు సాధించిన పంత్.. ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మెగాటోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే న్యూయార్క్‌కు చేరుకోగా.. ప్రమాదం తర్వాత ఎదురైన అనుభవాలను పంత్ పంచుకున్నాడు. ‘ రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సమయం నాకు ఒక అనుభవాన్ని నేర్పింది. అంత పెద్ద ప్రమాదం తర్వాత ప్రాణాలతో ఉంటానని అనుకోలేదు.
దేవుడి దయ నన్ను కాపాడింది. రెండు నెలల పాటు కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా రాలేదు. నొప్పితో ఏడు నెలల పాటు నరకయాతన అనుభవించా. వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తులను చూస్తే ఆందోళన కలిగేది. అందుకే ఎయిర్‌పోర్ట్‌కు కూడా వెళ్లాలంటే భయం వేసేది’ అని పంత్ చెప్పుకొచ్చాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు రిషబ్ పంత్ కీలకమయ్యే అవకాశం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పొట్టి ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేస్తే తన మొదటి ప్రాధాన్యత పంత్‌కేనని తెలిపాడు. ఇక మెగాటోర్నీకి పంత్‌ను ఎంపిక చేసి బీసీసీఐ మంచి పని చేసిందన్నాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో ప్రభావం చూపే ఆటగాళ్ల జాబితాలో పంత్ తొలి స్థానంలో ఉండే అవకాశముందని అంచనా వేశాడు.






