3 July, 2026 | 2:43 AM

అమెరికా పిలుస్తోంది

29-05-2024 12:58 AM

తొలిసారి క్రికెట్ ప్రపంచకప్‌నకు ఆతిథ్యం

భారత్ లీగ్ మ్యాచ్‌లన్నీయూఎస్‌లోనే

నిన్న మొన్నటి వరకు కోహ్లీ వికెట్ ఎలా తీయాలని బుమ్రా.. రోహిత్‌ను ఎలా బోల్తా కొట్టించాలని సిరాజ్ చేసిన ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్ పడింది. హెడ్ కోసం స్టార్క్ ప్రత్యేక ప్రణాళికలు.. మార్క్మ్ ఎత్తులకు రబడ పైఎత్తులు ఇవన్నీ ఐపీఎల్‌తోనే ముగిశాయి. ఇక ప్లేయర్లంతా జాతీయ జట్ల తరఫున అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. నాలుగు గ్రూప్‌ల్లో 20 జట్లు బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి!

క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడం కోసం ఐసీసీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈసారి మెగాటోర్నీలోని పలు మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహస్తోంది. టీమిండియా లీగ్ దశ మ్యాచ్‌లను అగ్రరాజ్యంలో ఆడించడం ద్వారా క్రికెట్‌కు మరింత క్రేజ్ తీసుకురావాలని ఐసీసీ పెద్దలు భావిస్తున్నారు. ప్రవాస భారతీయులు కూడా వరల్డ్‌కప్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బేస్‌బాల్, బాస్కెట్‌బాల్‌ను విపరీతంగా ఆదరించే అమెరికాలో క్రికెట్ మెగాటోర్నీ ఎంత మేర ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి!

విజయక్రాంతి ఖేల్ విభాగం : విశ్వవ్యాప్తంగా కోట్లాది మంధి అభిమానించే క్రికెట్ క్రీడ ఇప్పుడు అగ్రరాజ్యంలో సందడి చేయనుంది. అమెరికా వేదికగా తొలిసారి టీ20 ప్రపంచకప్ జరగనుంది. వచ్చే నెల 2 న ప్రారంభమై 29 వరకు జరగనున్న మెగాటోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు నిర్వహించనుండగా.. ఈ సారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా ప్రవాస భారతీయులు అధికంగా ఉండే అమెరికాలో టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఓవరాల్‌గా అమెరికా 16 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.

ప్రపంచంలో ఏమూల భారత జట్టు బరిలోకి దిగిన అభిమానులు బ్రహ్మరథం పట్టడం సహజమే కాగా.. అమెరికాలో ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఈ మెగాటోర్నీతో తేలిపోనుంది. 2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్ ప్రవేశ పేడుతుండటం కూడా అమెరికాలో క్రికెట్ క్రేజ్‌ను పెంచనుంది. వరల్డ్‌కప్‌ను సూపర్ హిట్ చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా గతానికి భిన్నంగా వేర్వేరు క్రీడారంగాలకు చెందిన ప్రముఖ ప్లేయర్లను వరల్డ్‌కప్‌నకు అంబాసిడర్లుగా నియమించింది. ఇప్పటికే జమైకా వీరుడు ఉసెన్ బోల్ట్ ప్రచారం పనిలో మునిగిపోగా.. ఫార్ములా1, బాస్కెట్‌బాల్ లీగ్‌ల్లోనూ వరల్డ్‌కప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 

కాలమే పెద్ద పరీక్ష!

సాధారణంగా వెస్టిండీస్‌లో మ్యాచ్‌లు అంటే భారతీయులు పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే.. మన సమయానికి అవి అనుకూలం కాకపోవడంతో వాటిపై అభిమానులు సైతం అంచనాలు పెట్టుకోరు. ఈ సమస్యను అధిగమించేందుకు ఐసీసీ బాగా కసరత్తు చేసి షెడ్యూల్ రూపొందించింది. లీగ్ దశలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ మన కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే విధంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మార్కెట్‌ను కోల్పోకుండా జాగ్రత్త పడింది. ఇక రోహిత్ సేన సెమీఫైనల్‌కు చేరితే.. ఆ మ్యాచ్‌ను గాయానాలో నిర్వహించనున్నారు. భారత కాలమానానికి అది అనుకూలం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీమిండియా ముందడుగు వేస్తే రెండో సెమీఫైనల్ ఆడనుంది.

తొలి సెమీఫైనల్ మన సమయం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుండగా.. రోహిత్ సేన సెమీస్ చేరితే రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆడనుంది. వర్షాల కారణంగా మ్యాచ్‌లకు ఆటంకం ఏర్పడితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. సెమీఫైనల్, ఫైనల్లో మాత్రం కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. తొలి సెమీఫైనల్‌తో పాటు తుదిపోరుకు రిజర్వ్ డే ఉంది. రెండో సెమీస్‌కు మాత్రం సమయం లేకపోవడంతో రిజర్వ్ డే కేటాయించలేదు. అందుకు బదులు ఫలితం తేలడం కోసం 250 నిమిషాల అదనపు సమయాన్ని రిజర్వ్ చేశారు. ఇక లీగ్ దశతో పాటు సూపర్ నాకౌట్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ నిబంధన కొనసాగనుంది. అంటే ఇరు జట్ల స్కోర్లు సమమైతే విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. అది కూడా సమమైతే ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు కొనసాగుతాయి.

గ్రూప్ టీమిండియా

2007లో తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్ నిర్వహించగా.. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన మహేంద్రసింగ్ సారథ్యంలోని భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ రాగా.. ఈ ఊపులోనే మన దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అంకురార్పణ జరిగింది. అయితే ఆ తర్వాత మాత్రం టీమిండియా ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్‌తో మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని నిరూపితమైనా.. ఐసీసీ టోర్నీలో మాత్రం మనవాళ్లు చాంపియన్‌గా నిలవడంలో విఫలమవుతూ వస్తున్నారు.

మరి ఈ సారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ సేన ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. దాయాది పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికాతో కలిసి గ్రూప్ నుంచి బరిలోకి దిగనున్న భారత జట్టు.. సూపర్ దశకు చేరడం దాదాపు ఖాయమే. మెగాటోర్నీకి ముందు ఐపీఎల్ ద్వారా భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ప్లేయర్లు.. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ (జూన్1న) ఆడనున్నారు. వచ్చే నెల 5న ఐర్లాండ్‌తో రోహిత్ సేన కప్పు వేట ప్రారంభించనుండగా.. ఆ తర్వాత 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, 12 ఆతిథ్య అమెరికాతో, 15న కెనడాతో తలపడనుంది. గ్రూప్ దశలో టాప్‌టీ స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ దశకు అర్హత సాధించనున్నాయి.

భారత షెడ్యూల్

తేదీ                  మ్యాచ్                      వేదిక                      సమయం

జూన్ 5       భారత్ x ఐర్లాండ్      న్యూయార్క్                  రా.8.00

జూన్ 9      భారత్ x పాకిస్థాన్     న్యూయార్క్                 రా.8.00

జూన్ 12      భారత్ x అమెరికా     న్యూయార్క్                రా.8.00

జూన్ 15      భారత్ x కెనడా                ఫ్లోరిడా                 రా.8.00

యువీ, అఫ్రీది అంబాసిడర్లుగా..

మెగాటోర్నీ బరిలోకి దిగుతున్న దేశాలన్ని తమ తమ జట్లను ప్రకటించగా.. వరల్డ్‌కప్‌లో వ్యాఖ్యానం చేయనున్న కామెంటేటర్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. రవిశాస్త్రి, నాసిర్ హుసేన్, ఇయాన్ స్మిత్, హర్షాభోగ్లే, ఇయాన్ బిషప్, దినేశ్ కార్తీక్, స్టీవ్ స్మిత్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఫించ్, రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్, హెడెన్, మోర్గాన్, వసీం అక్రమ్ తదితరులు మెగాటోర్నీలో వ్యాఖ్యతలుగా దర్శనమివ్వనున్నారు. టీ20 ప్రపంచకప్‌నకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది, వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్, జమైకా చిరుత ఉసెన్ బోల్ట్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.