20-12-2024 12:00:00 AM
మహోన్నతము, మహోదారము, దుర్లభము అయిన మానవజన్మను సార్థకము, పారమార్థికము, ఆదర్శవంతము, ప్రయో జనకరము, పరోప కృతిమంతమూ చేసుకొనక పోయినట్లయితే ఒక జన్మవృధా అవుతుంది. జీవితాన్ని సమగ్రంగా సమ్యక్ దర్శ నం చేస్తూ జీవితాన్ని జీవించాలి. దానిని నడపకూడదు. గడపకూడదు.
ఈ భూమిక ఆధారంగా మానవజన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికీ మార్గోపదేశ, సందేశ, ఆదేశాలను అనుగ్రహిస్తూ మహర్షులు ప్రతిపాదించిన దర్శన భాండాగారమే ‘తైత్తిరీయోపనిషత్తు’! శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లిగా ఈ ఉపనిషత్తు, నిత్య జీవితానికి అవసరమైన సర్వోపాయాలను, లోకమర్యాదలను ఆవిష్కరిస్తున్నది. ముందుగా శిక్షావల్లి, గురు-శిష్య పరంపరానుగతమైన విష యాలను స్పష్టంగా వివరిస్తుంది. శిష్యుడు గురువును శ్రద్ధతో, భక్తితో గౌరవించాలి.
ప్రేమించాలి, సేవించాలి. తాను సంపాదించుకున్న విద్యను తిరిగి లోకానికి అందించాలి. తాను విజ్ఞాన సర్వస్వమై వన్నెలీనుతూనే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించాలి. ప్రేమ, సేవలతో కూడిన సమ్యక్ భావనతోనే జీవించాలి. సమస్త లోకాలు సుఖంగా ఉండాలని ప్రార్థించాలి.
నాలుక జారితే స్వర్గం దూరమౌతుంది. కనుక వాక్కును నియంత్రించుకోవాలి. వాక్కు అగ్ని స్వరూపం. ప్రాణవాయువు, మూలాధారం నుండి స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత చక్రాలను దాటి విశుద్ధ చక్రంలో ప్రవేశించినపుడు వాక్కుగా బయటకు వస్తున్నది. దేనినైనా పొందినా, పోగొట్టుకున్నా వాక్కు కారణమవుతున్నది. కనుక అధ్యాత్మ సాధనలో మాటను నియంత్రించుకోవటమే తొలి మెట్టు! గురువు నుంచీ తాను పొందిన నైతిక, ఆధ్యాత్మిక విలువలను నిరంతరం మననం చేసుకుంటుండాలి.
ధర్మమార్గాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలిపెట్టరాదు. వంశవృక్షాన్ని పెంచాలి. దానిని విస్తృత సుందర వనం చేయాలి. స్వచ్ఛకీర్తి, గౌరవం, మర్యాద, సంపదలను సమృద్ధం చేసుకోవాలి. తల్లిని, తండ్రిని, ఆచార్యుణ్ణి, అతిథిని దైవంగా భావించి, సేవించాలి. దానం చేయాలి. నిదానంగా ఉండాలి. నయంగా ఉండాలి. వినయంగా జీవించాలి. ప్రాజ్ఞులు నడుస్తున్న మార్గంలో నడవటం మరువరాదు. ఎవరూ తప్పులెన్నని రీతిలో జీవించాలి. దోషులపట్ల సైతం ఔదార్యాన్ని, ప్రేమను, దయను, జాలిని, సానుభూతిని కలిగి ఉండాలి. అవసరమైన వేళ వాటిని సహజంగా ప్రదర్శించాలి. సర్వవేద విజ్ఞానం బోధిస్తున్నది ఇదే!
గురువే పూర్వరూపం. నీవు ఉత్తర రూపానివి. నీ ఉనికిని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మరచి, సంపూర్ణత వైపు, స్వచ్ఛత వైపు, సమగ్రత వైపు, ఉదారత వైపు నీ మనసును నడిపించాలి. తల్లి పూర్వరూపం, తండ్రి ఉత్తర రూపం. సంతానం సంధి. పుట్టుక సంధానం. పరమాత్మను రక్షణ కవచంగా భావించాలి. బుద్ధి కుశలత, నిశిత దృష్టి, సమర్థత, వేగం, స్పష్టత, శ్రవణ శక్తి, ధారణ వంటి మేధా సంపత్తిని వృద్ధి చేసుకోవాలి.
నిష్ఠగా అధ్యయనం చేయాలి. నిష్కర్షగా విశ్లేషించాలి. ప్రశాంతంగా, సత్వగుణంతో సౌమ్యంగా, ప్రసన్నంగా ఉండాలి. వెలుగులు బయట ఉన్నవి మాత్రమే కాదని, అసలు వెలుగు లోపల ఉన్నదని గ్రహించాలి. గురువును వెలుగుల నిధిగా గౌరవించాలి. భక్తితో ప్రణమిల్లాలి. శక్తివంచన లేకుండా సేవించాలి, భావించాలి, సంభావించాలి, ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని పెంచాలి. ఆనందాన్ని పంచాలి.
అంతటా ఉన్నది ఈశ్వరుడేనని భావించాలి. శిష్యుడిగా, అంతేవాసిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.. అని సార్వకాలికం, విశ్వజనీనం అయిన నైతిక శక్తిని గురించి బోధిస్తున్నది శిక్షావల్లి.
- వి.యస్.ఆర్.మూర్తి