calender_icon.png 29 October, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా జడ్జిని కలిసిన ప్రత్యేక ఏర్పాట్లు అవసరం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు

29-10-2025 08:02:42 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని "ప్రత్యేక అవసరాలుగల పిల్లల కేంద్రం"లోని దివ్యాంగుల తల్లితండ్రులు వారి పిల్లలు, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత లక్ష్మీ ని జిల్లాకోర్టు ప్రాంగణంలో గల ఆమె చాంబర్లో మంగళవారం కలిసి తమ సమస్యల గోడును వెల్లడించుకున్నారు.పుట్టుకతోనే పుట్టెడు మానసిక, శరీరక రుగ్మతలతో తళ్లడిల్లుతున్న పిల్లలకు అధికార, అనాధికార సమస్యల విషయంలో కొట్టుమిట్టడుతున్నామని తమ ఆవేదనను తెల్ల కాగితాలలో లిఖించి, టైప్ చేయించి అందించారు.

వినతులను స్వీకరించిన జిల్లాజడ్జి భారత లక్ష్మీ పిల్లల తల్లితండ్రుల ఆవేదను సావధానంగా ఆలకించి.. ప్రత్యేక అవసరాలుగల పిల్లల కేంద్రంలో నెలకొన్న సమస్యలను,దివ్యాంగుల గుర్తింపులో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యను అభ్యశించడంలో విద్య సంబంధిత ధ్రువ పత్రాలు, దివ్యాంగుల పెన్షన్ అందకపోవడం ప్రధానంగా ఉన్న విషయాలను గమనించారు. అన్ని తెలుసుకున్న ఆమె జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పిల్లల సమస్యలు పరిష్కరించే పని చేపడతానని వివరించారు.

పిల్లలంతా ముద్దుగా ఉన్నారని.. సాంకేతికత, ఆర్టిపిషియల్ ఇంటలిజెంట్ అభివృద్ధి చెందుతున్న రోజులలో పిల్లల మానసిక, శరీరక రుగ్మతలు దూరం కావడానికి ఎంతో దూరం లేదనే విషయాన్ని తల్లితండ్రులకు ఎరుక జేశారు. ప్రత్యేక అవసరాలుగల పిల్లల కేంద్రానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తోడునీడగా నిలబడుతుందనే  వారికి తెలిపారు.అధికారిక వ్యవస్థల తోడ్పాటు పిల్లల బాగోగుల వెంట ఉంటుందని జిల్లాజడ్జి భారత లక్ష్మీ భరోసాను కల్పించారు.తెల్ల కాగితాలపై రాసిన,టైప్ చేసి ఇచ్చినవి ఆచరణ సాధ్యం అయ్యే విదంగా పాటుపడతామని ఆమె పిల్లల బృందానికి మాటనిచ్చారు.