calender_icon.png 13 January, 2026 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపైనే దుకాణం..

13-01-2026 12:15:17 AM

ప్రమాదంగా మారిన పార్కింగ్ !

రంగంపేట ఆర్‌అండ్‌బి రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ 

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

కొల్చారం, జనవరి 12: ప్రధాన రోడ్డుపై తినుబండారాల దుకాణం ఏర్పాటు చేయడంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మండల పరిధిలోని రంగంపేటలో వైన్స్ దుకాణం ముందు మెదక్ - సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఆర్ అండ్ బి రోడ్డు స్థలంలో తినుబండారాల దుకాణం ఏర్పాటు చేయడంతో రోడ్డుపై వాహనాలు నిలపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సాయంత్రం సమయాలలో వైన్స్ ముందు నుండి వెళ్లాలంటే ప్రాణాలు చేతులో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.  గతంలో ఇద్దరు విద్యార్థులు వైన్స్ ముందు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.

అయినప్పటికీ ఆర్‌అండ్ బి అధికారులు కానీ పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు రోడ్డుపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణానికి వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో సాయంత్రం కాగానే ఈ మార్గంలో వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. గతంలో రంగంపేట వైన్స్ ముందు జరిగిన వేరువేరు ప్రమాదాలలో ఇద్దరు విద్యార్థులతో పాటు మరో ముగ్గురు ఇతర వ్యక్తులు సైతం మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరిగాయని, అయినా అధికారుల తీరులో మార్పు రాలేదని విమర్శిస్తు న్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్ బి శాఖల అధికారులు రోడ్డుపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించడంతోపాటు వాహనాలను రోడ్డుపై కాకుండా ఇతర స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం...

మద్యం దుకాణం ముందు ప్రధాన రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. రోడ్డుపైనే తినుబండారాల దుకాణం ఏర్పాటు చేయవద్దు. ఈ విషయంలో దుకాణం తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

నగేశ్, ఎక్సైజ్ సీఐ