calender_icon.png 13 January, 2026 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలలను బడులకు పంపేలా ప్రోత్సహించాలి

13-01-2026 12:13:13 AM

జిల్లా వ్యాప్తంగా 28 కేసులు నమోదు

జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

మెదక్, జనవరి 12(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా జనవరి1 వ తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్త్మ్రల్ కార్యక్రమం సందర్భంగా మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా జిల్లా అదనపు ఎస్పీ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, వారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు అవసరమైతే సంరక్షణ గృహాలకు తరలించాలని సూచించారు.

బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా 9 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి మొత్తం 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతిరోజూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు, ఎన్జీవోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.