calender_icon.png 13 January, 2026 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోదాం పద.. ‘సింగరాయ’జాతర

13-01-2026 12:17:24 AM

ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక సంబరం.. సింగరాయ

నంగునూరు, జనవరి 12: తెలంగాణ సంస్కృతిలో జాతరలకు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చని ప్రకృతి,గలగల పారే వాగులు, ఎత్తున గుట్టల మధ్య ఆధ్యాత్మికతను పంచే అరుదైన క్షేత్రమే సింగరాయ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెల్ల, తంగళ్లపల్లి, బస్వాపూర్ గ్రామాల సరిహద్దుల్లో జరిగే ఈ జాతర, భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.

వందల ఏళ్ల చరిత్రసాత్విక జాతర

ఈ క్షేత్రం 13వ శతాబ్దానికి చెందినదని చరిత్ర చెబుతోంది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో ఈ ప్రాంతంలో జలాశయాన్ని నిర్మించేందుకు ’సింగరాయ’ అనే ఇంజనీరు వచ్చారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన ఆయన, ఇక్కడే ఉండిపోయి గుహలో నరసింహస్వామిని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామివారు కొండపై ఉన్న ఒక పెద్ద బండరాయి కింద,సహజసిద్ధమైన గుహలో కొలువై ఉన్నారు.భక్తులు మోకాళ్లపై ప్రాకుతూ వెళ్లి స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత. ఆయన పేరు మీదుగానే ఇది ’సింగరాయ జాతర’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లభించిన బౌద్ధ విగ్రహాలు ఈ ప్రాంతం వేల ఏళ్ల నాటి నాగరికతకు నిలయమని సాక్ష్యమిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జాతరలతో పోలిస్తే సింగరాయ జాతర ఎంతో భిన్నమైనది. ఇక్కడ మద్యం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం. భక్తులు కేవలం సాత్విక ఆహారాన్నే భుజిస్తారు. భక్తులు తమ వెంట తెచ్చుకున్న చిక్కుడు, వంకాయ, టమాటాలను కలిపి సింగారయ‘చారు‘ అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేసుకుంటారు.

మూలికలను తాకుతూ వచ్చే ’మోయ తుమ్మెద వాగు’ నీటితో ఈ వంటలు చేయడం వల్ల అవి ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయని భక్తుల నమ్మకం. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. సిద్దిపేట, మెదక్, వరంగల్, కరీంనగర్ ,రాజధాని హైదరాబాద్ నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహారాష్ట్రలోని భీవండి, ముంబై వంటి నగరాల నుండి కూడా భక్తులు ఈ జాతరకు రావడం విశేషం. వలస వెళ్ళిన వారు సైతం ఏటా జాతర సమయంలో తమ సొంత గడ్డకు చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో తూర్పు నుండి పడమరకు ప్రవహించే మోయ తుమ్మెద వాగు ప్రధాన ఆకర్షణ. పుష్య బహుళ అమావాస్య నాడు వేకువజామునే వేలాది మంది భక్తులు ఈ వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

ఒకే ఒక్క రోజు సూర్య అస్తమయంతో ముగింపు

ఈ జాతర కేవలం ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై,సాయంత్రం 6 గంటలకే ముగుస్తుంది.సూర్యాస్తమయం తర్వాత కొండపై ఉండటం స్వామివారికి తలనొప్పి కలిగిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే చీకటి పడకముందే భక్తులందరూ కొండ దిగి ఇళ్లకు చేరుకుంటారు.దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో కాలినడకన ప్రయాణించి స్వామిని దర్శించుకోవడం భక్తులకు ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది.

ఈ ఆదివారమే జాతర..

ఆధ్యాత్మికతకు, ప్రకృతి సౌందర్యానికి, సాత్విక జీవనానికి సింగరాయ జాతర ఒక నిదర్శనం. ఆధునిక కాలంలోనూ తన విశిష్టతను కాపాడుకుంటూ వస్తున్న ఈ జాతరను సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన అనుభవం. ఈ ఏడాది జనవరి 18న (ఆదివారం) జరగనున్న ఈ వేడుకకు తరలిరావాలని భక్తులు సంబురపడుతున్నారు.

పర్యాటక అవకాశాలు

చుట్టూ గుట్టలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య ఈ క్షేత్రం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుంది. సమీపంలోని సింగరాయ ప్రాజెక్టు పర్యాటకులకు అదనపు ఆకర్షణ. అయితే, కూరెల్ల -తంగళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాల కారణంగా ఈ ప్రాంతం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించి, అవసరమైన రోడ్డు సౌకర్యాలు, వసతులు కల్పించి, సింగరాయను ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుకుంటున్నారు.

జాతరకు చేరుకుని మార్గాలు...

సిద్దిపేట నుండి బస్సాపూర్ వరకు బస్సులో వచ్చి అక్కడ నుంచి ఆటోల ద్వారా జాతర వద్దకు చేరుకోవచ్చు. కరీంనగర్ రహదారిలోని శనిగారం స్టేజి నుంచి తంగారపల్లి చేరుకోవచ్చు.