21-07-2025 01:56:12 AM
న్యూఢిల్లీ, జూలై 20: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఉభయసభల్లోని నేతలతో సమావేశం అయ్యారు.
ఈ భేటీకి కేంద్ర మంత్రి, రాజ్యసభాపక్షనేత జేపీ నడ్డా అధ్యక్షత వహించారు. పహల్గాం ఉగ్రదాడి, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, ట్రంప్ కాల్పుల విరమణ వాదన వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తగా.. పార్లమెంట్ నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిరణ్ రిజిజు మీడియాతో తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల సమన్వయం అవసరం అని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్‌వాల్, రాందాస్ ఆథవలే, కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, గౌరవ్ గొగొయ్, ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, డీఎంకే నేత టీఆర్ బాలు, మురుగన్ తదితరులు హాజరయ్యారు. 51 రాజకీయ పార్టీల నుంచి 54 మంది సభ్యులు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా చేపట్టిన సంతకాల సంఖ్య 100 దాటిందని మంత్రి రిజిజు పేర్కొన్నారు. ఆగస్టు 21వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
మీడియా ముందుకు మోదీ..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు భారత ప్రధాని మోదీ.. మీడియాతో చర్చాగోష్టి నిర్వహించనున్నారు. 18వ లోక్‌సభలో ఇవి ఐదో విడత సమావేశాలు. ఇక నేటి నుంచి పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఆరంభం కానుంది.