calender_icon.png 23 July, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్

21-07-2025 01:54:33 AM

  1. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఎంపీ

ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు

విజయవాడ, జూలై 20: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏ4గా ఉన్న మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించారు. శనివారం రోజు ఎంపీని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆదివారం విజయవాడ కోర్టులో హాజరుపరిచాడు.

కోర్టులో ప్రవేశపెట్టే ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు నిర్ధరించడంతో అధికారులు ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. మిథున్ రెడ్డి అరెస్ట్‌కు 29 కారణాలను సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్‌విత్ 34, 37 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సిట్ తరఫున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.