14-08-2025 01:43:01 AM
- ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల ఆవేదన
- టోకెన్లు జారీ చేసిన రూ.650 కోట్లలో కనీసం సగమైనా ఇవ్వండని విజ్ఞప్తి
- రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలకాక విద్యార్థుల నుంచి ఫీజు వసూలు
హైదరాబాద్, ఆగస్టు 1౩ (విజయక్రాం తి): ఫీజు బకాయిలు చెల్లించండివ్వండి మహాప్రభో అంటూ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజ మాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. గత మూడేళ్ల నుంచి రావాల్సిన ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు ఎంతకీ విడుదల చేయకపోవడంతో కాలేజీలను నడప లే మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్కార్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవ డం లేదని.. ప్రభుత్వమే తమ గోడు విన కుం టే మరి ఇంకెవ్వరు వింటారని నిలదీస్తున్నా రు. ఫీజు బకాయిలు విడుదలకాకపోవడంతో సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల నుంచి పలు డిగ్రీ కాలేజీలు ఫీజులు వసూలు చే సుకుంటున్నాయి.
తొలుత డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని.. ఫీజు రీయెంబర్స్‌మెంట్ వచ్చాక తిరిగిచ్చేస్తామని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఫీజు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకున్న తమ సమస్య పరిష్కారం కాలేదని ఓ కళాశాల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం తమకు రీయెంబర్స్‌మెంట్ చెల్లిస్తామని హామీఇచ్చి ఐదు నెలలవుతున్నా తమ సమస్యను ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు.
ప్రభుత్వంపై అసంతృప్తిలో కాలేజీలు
రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. అమ్మ అన్నం పెట్టదు.. అడుక్కోనివ్వదనేలా పరిస్థితి ఉందని కాలేజీల యజ మానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే ఫీజుల కోసమని విద్యా ర్థులకు సర్టిఫికెట్లను నిలిపివేయొద్దు. అడిగినవి ఇచ్చేయాలి. కానీ రాష్ట్రంలోని కొన్ని కళాశాలలు.. నిర్వహణ భారాన్ని భరించలేక సర్టిఫికె ట్ల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఎంతో కొంత ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి.
ఇవి కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచే అని కళాశాలల యజమానులు పేర్కొంటున్నారు. మరికొన్ని కాలేజీలు ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండానే ఇచ్చేస్తున్నాయి. అయితే ఇలా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను యూనివర్సిటీ అధికారులు తనిఖీల పేరుతో, దోస్త్ నుంచి తమ కాలేజీ పేరును తొలగిస్తామని బెదిరిస్తున్నారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వమే మో పెండింగ్ ఫీజు బకాయిలను ఇవ్వదు.. మరోవైపేమో విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వదు.
మరీ చిన్నాచితక కాలేజీలు ఎలా నడవాలని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఏకంగా అసెంబ్లీలోనే ఫీజు బకాయిలు విడతలవారీగా అన్ని కాలేజీలకు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో యూనివర్సిటీల పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీలు పరీక్షలను నిర్వ హించకుండా వాయిదా వేశాయి. దీక్షలు, నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ పెద్దలకు కలిసి వినతిపత్రాలు లాంటివి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో కాలేజీలు..
ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ను సకాలంలో యాజమాన్యాలకు విడుదల చేస్తేకానీ కాలేజీలు సజావుగా నడవవు. లేకుంటే వాటిని మూసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ గత మూడేళ్లుగా డిగ్రీ కాలేజీలకు రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపో యాయి. 2022 2023 2024 25 విద్యాసంవత్సరానివే సుమారుగా రూ. 1,200 కోట్లు వరకు బకాయిలున్నాయి. దీనికితోడు రూ.650 కోట్లకు టోకెన్లు ఇప్పటికే విడుదల చేశారు.
కానీ వీటికి డబ్బులు మాత్రం విడుదల చేయడంలేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే గతేడాది డిసెంబర్‌లో సుమారు రూ.110 కోట్ల వరకు పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. పాతబకాయిలన్నింటినీ పన్నెండు వాయిదాలు గా విభజించి చెల్లిస్తామని చెప్పి ఐదు నెలలవుతున్నా ఇంతవరకూ అతీగతీ లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు రీయెంబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీలను నడపడం భారంగా మారుతోందని, సిబ్బంది జీతాలు, అద్దెలు, ట్యాక్స్‌లు, కరెంట్ బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్నామంటున్నారు. అప్పు చేసి, లోన్లు తీసుకొచ్చి నడుపుతున్నామని చెబుతున్నారు.
ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి
సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులను కలిసి ఇప్పటికే మా సమస్య ను వివరించాం. వాయిదాల పద్ధతుల్లో చెల్లిస్తామని చెప్పి ఐదు నెలలవుతున్నా బకాయిలు విడుదల చేయడంలేదు. కనీ సం గతంలో జారీ చేసిన రూ.650 కోట్ల టోకెన్లలో రెండు మూడు వందల కోట్లయి నా తొలుత విడుదల చేస్తే కాలేజీలను నడపగలుగుతాం.
లేకుంటే కాలేజీలు నడప లేం. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేశాం. కానీ తెలం గాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి ప్రభుత్వంతో మాట్లా డి సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు పరీక్షలను నిర్వహించాం. నేడు లేదా రేపు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి తమ గోడును వెలబుచ్చుకుంటాం.
బీ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు