calender_icon.png 7 November, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలివ్వండి!

07-11-2025 12:00:00 AM

  1. విద్యాశాఖను కోరిన ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు
  2. రావాల్సిన బకాయిలు రూ.300-400 కోట్లు
  3. సీఎంతో చర్చించి, పరిష్కరిస్తామన్న విద్యాశాఖ కార్యదర్శి

హైదరాబాద్, నవబంర్ 6 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు కోరాయి. ఈ మేరకు గురువారం విద్యా శాఖ కార్యదర్శి శ్రీదేవసేనతో ఇంటర్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల వారు భేటీ అయ్యారు. 2022-23, 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రావాల్సిన బకాయిలు రూ. 300-400 కోట్ల వరకు ఉన్నాయని, వీటిని చెల్లించాలని కోరారు.

దీంతో స్పందించిన ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారితో చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమెను కలిసిన వారిలో ‘ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు (ఫతి)లో లేని కొన్ని నాన్ ప్రొఫెషనల్ కాలేజీలు కూడా ఉన్నట్లు యూనియన్ నేత ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే ఒకవైపు ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, లా ఇతర ప్రొఫెషనల్ కాలేజీలన్నీ బంద్ చేపడుతుంటే ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో అధికారులు సమావేశం నిర్వహించడమేంటని ఫతి నేతలు ప్రశ్ని స్తున్నారు. 

ఏం చేద్దాం.. అధికారుల సమాలోచనలు!

ఇదిలా ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం ప్రభుత్వంలో హాట్‌టాపిక్‌గా మారడంతో సమస్యను పరిష్కరించేందుకు విద్యాశాఖ ఉన్నతా ధికారులు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఈ మేరకు సెలవుల్లో విదేశాలకు వెళ్లిన విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా (ఇన్‌ఛార్జ్ బాధ్య తలు శ్రీదేవసేనకు ఇచ్చారు)తో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి గురువారం జూమ్‌మీటింగ్‌లో చర్చించినట్లు తెలిసింది.

ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్ కాలేజీల నేతలను మరోసారి పిలిపించి చర్చలు జరిపే అవకాశం లేకపోలేదు. డిగ్రీ కాలేజీల యాజమా న్యాలను బుధవారం చర్చలకు పిలిచినా వారు వెళ్లలేదు. ఇంజినీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కాలేజీలను పిలవకుండా తమ ఒక్కరినే ఎలా పిలు స్తారని బదులిచ్చినట్లు తెలిసింది.