calender_icon.png 10 September, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు మరిన్ని నిధులు ఇవ్వండి

08-08-2024 12:00:00 AM

-ఎ.మనోహర్ రెడ్డి :

* పాఠశాల విద్యాశాఖ బడ్జెట్‌లో కనీసం 85 శాతం అంటే రూ.17,000 కోట్లకుపైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలకే పోతాయి. మిగిలిన దాంట్లో సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజనానికి మొత్తం సొమ్ము ఖర్చవుతుంది. మౌలిక వసతులకు, నూతన భవనాల నిర్మాణాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని దుస్థితి ఉంది.

* పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రయివేటు విశ్వవిద్యాలయాలను కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ సర్కార్‌పై ఎంతైనా ఉంది. విద్యారంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, ఇందుకు అనుగుణంగా నిధుల విషయంలో పెద్ద పీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రాష్ట్రంలో ఈసారి విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.21,292 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా 7.3 శాతమే. రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం 2014-15 బడ్జెట్‌లో విద్యాశాఖకు 10.89 శాతం కేటాయించగా, ఆ తర్వాతి నుంచి తగ్గుతూ వస్తున్నది. 2019--20లో 6.77 శాతం, 2020--21లో 6.69 శాతం, 2021--22లో 6.78 శాతం, 2022-23లో 6.57 శాతం మాత్రమే కేటాయించారు. ఇది ఈసారి 7.3 శాతానికి కాస్త పెరిగింది. అయితే, కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో విద్యా రంగానికి 15 శాతం నిధులు ఇస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం రేవంత్ సర్కార్ చూపించలేక పోయింది.

85 శాతం కేటాయింపులు జీతాలకే

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో వందలాది భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాఠ శాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది. 194 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలు 422, డిగ్రీ కళాశాలలు 132 ఉన్నాయి. వీటిలో కూడా బోధనా సిబ్బంది కొరత వెంటాడుతున్నది. ఈసారి కేటాయించిన విద్యాశాఖ బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.17,942 కోట్లు, సాంకేతిక, ఉన్నత విద్యకు కలిపి రూ.3,350 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యలో భాగంగా కళాశాల విద్యాశాఖకు రూ.600 కోట్లు, ఇంటర్ విద్యాశాఖకు రూ.834 కోట్లు ప్రతిపాదించారు.

మొత్తం పాఠశాల విద్యాశాఖ బడ్జెట్‌లో కనీసం 85 శాతం అంటే రూ.17,000 కోట్లకుపైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలకే పోతాయి. మిగిలిన దాంట్లో సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజనానికి మొత్తం సొమ్ము ఖర్చవుతుంది. మౌలిక వసతులకు, నూత న భవనాల నిర్మాణాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని దుస్థితి ఉంది. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు నెలకొల్పుతామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అయితే, బడ్జెట్‌లో అంతర్జాతీయ పాఠశాలలకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వాటిని ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు’గా పిలవాలని అన్నారు. అయితే, వీటిలో ఏ మేరకు ఏర్పాటు చేస్త్తారన్నది వేచి చూడాల్సి ఉంది.

సొంత భవనాలు లేని ఇంజినీరింగ్ కాలేజీలు

రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాలకు  కేటాయించిన సొమ్ము మొత్తం రూ.500 కోట్లు మాత్రమే! అందులో రూ.200 కోట్లు ఓయూ, మహిళా వర్సిటీలకు, మిగిలిన 10 కోట్లు యూనివర్సిటీ లకు.. రూ.300 కోట్లు అంటే సగటున ఒక్కో దానికి రూ.30 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం 11 యూనివర్సిటీల్లో 1800 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ అంశాన్ని బడ్జెట్‌లో సర్కారు ప్రస్తావించలేదు. జేఎన్‌టీయూహెచ్ కింద సిరిసిల్ల, వనపర్తితో పాటు గత ఏడాది ప్రారంభమైన పాలేరు, మహబూబాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలకు శాశ్వత భవనాలు లేవు. టీఎస్ ఎంసెట్‌లో 5000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా బోధనా సిబ్బంది లేమి కారణంగా ఏయూ ఇంజినీరింగ్ లాంటి కళాశాలల్లో జాయిన్ కావ డానికి నిరాకరిస్తూ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. మన విద్యావ్వస్థ ఎంత దయనీయ స్థితిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

కేంద్ర బడ్జెట్‌లోనూ కోత

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యారంగానికి భారీగా కోత పెట్టారు. ముఖ్యంగా యూజీసీకి అత్యధికంగా 60.99 శాతం బడ్జెట్ తగ్గింది. గత సంవత్సరం రూ.6,409 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.2,500 కోట్లకు పరిమితం  చేశారు. దీని ప్రభావం వల్ల మన విశ్వవిద్యాలయాలకు వచ్చే గ్రాంట్స్‌లో భారీగా కోత పెట్టే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1.20 లక్షల కోట్లే ఇచ్చి రూ.9 వేల కోట్లు తగ్గించారు.

భారంగా మారిన పరీక్ష ఫీజు పెంపు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలి క వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఆందోళనలో విద్యార్థు లు ఉన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు తగినన్ని నిధులు కేటాయించని కారణంగా యూజీ డిగ్రీ, పీజీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫీజును రూ.1200 నుంచి రూ.4000కు భారీ మొత్తంలో పెంచడం జరిగింది. ఈ ఫీజు పెరుగుదల పేద విద్యార్థులకు మోయలేని భారంగా మారిపో యింది. గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు రూ.7,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్న కారణంగా అటు విద్యార్థులు, ఇటు ప్రైవేటు కళాశాలల పరిస్థితి దయనీయంగా తయారైంది.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి బడ్జెట్ ప్రతిపాదలకు సవరణ చేయాలి. తక్షణం విద్యా రంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి. విద్యాశాఖకు ప్రత్యేకమైన మంత్రినీ నియమించాలి. అలాగే, అన్ని విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతులను నియమించాలి. విశ్వవిద్యాలయా లకు కేటాయించిన రూ.500 కోట్లతోపాటు మరో రూ.2,500 కోట్లు సమకూరి స్తే గానీ వాటి మనుగడ కనీస ఆశాజనకంగానైనా సాగించలేవు. గత బడ్జెట్‌లో 11 విశ్వవిద్యాలయాలకు వేతనాల కోసం బ్లాక్‌గ్రాంట్ కింద అప్పటి ప్రభుత్వం రూ.835.94 కోట్లు కేటాయించి తీరా రూ.784.64 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

ఈసారి బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.910.34 కోట్ల నిధులను వెన్వెంటనే విడుదల చేయాలి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రయివేటు విశ్వవిద్యాలయాలను కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా రేవంత్ సర్కార్‌పై ఎంతైనా ఉంది. విద్యా రంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, ఇందుకు అనుగుణంగా నిధుల విషయంలో పెద్ద పీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాసకర్త అధ్యక్షుడు, 

తెలంగాణ విద్యాపరిరక్షణ సమితి

సెల్: 9618254567