13-03-2025 12:00:00 AM
ఉక్రెయిన్‌లో శాంతిరేఖలు పొడచూపుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో దాదాపు 8 గంటల పాటు అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాల మధ్య జరిగిన చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా ఉక్రెయిన్‌కు నిలిపివేసిన సైనిక సహాయంతో పాటుగా ఇంటెలిజన్స్ సమాచా రాన్ని అందజేయడాన్ని కొనసాగిస్తుంది.
ఈ చర్చలపై జెలెన్‌స్కీ కూడా స్పందించారు. అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే కాల్పుల విరమణ మొత్తం అన్ని రంగాలకు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రష్యాగనుక ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని జెలెన్‌స్కీ చెప్పారు. గత రెండు రోజులుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
జెడ్డాలో అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాల మధ్య ఎనిమిది గంటల పాటు సాగిన చర్చల అనంతరం ఇరుపక్షాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ప్రతిపాదనలను రష్యాకు సమర్పిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబిడో చెప్పారు. ‘ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉంది’ అని కూడా ఆయన చెప్పారు. చర్చ ల్లో అమెరికా తరఫున రుబిడోతో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ కూడా పాల్గొన్నారు.
ఉక్రెయిన్ తరఫున ఆ దేశ విదేశాంగ, రక్షణ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో ఘర్షణలకు ముగింపు పలకడం తన అంతర్జాతీయ ప్రాధాన్యతల్లో అత్యం త ముఖ్యమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచీ చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత నెల 28న వైట్‌హౌస్ లో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన సమావేశం ఇరువురి మధ్య వాదోపవాదాలకు దారితీసిన నేపథ్యంలో చర్చలు మళ్లీ జరుగుతాయని ఎవరూ భావించలేదు.
అయితే జెలెన్‌స్కీ ఓ మెట్టు దిగడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. నిజానికి వైహౌస్‌లో జరిగిన సమావేశంలో ఇరువురి మధ్య ఉక్రెయిన్ ఖనిజ వనరులకు సంబంధించి ఒప్పందం కుదురుతుందని, దీంతో కాల్పుల విరమణకు మార్గం సుగమం అవుతుందని భావించారు. అయితే ఆ సమావేశం అర్ధంతరంగా ముగియడంతో ఆ ఒప్పందం కుదరలేదు.
అయితే జెలెన్‌స్కీ కోరుతున్నట్లుగా సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌కుసెక్యూరిటీ గ్యారంటీలపై ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం గమనార్హం. ‘రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోకుండా ఉండాలంటే అమెరికా ఉక్రెయిన్‌లో ఉండడమే నిజమైన పరిష్కా రం’ అని కొద్ది రోజులక్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకానికి అమెరికాను అనుమతిస్తే అదే ఆ దేశానికి రక్షణగా మారుతుందనేది ఆయన అభిప్రాయం. అయితే ఈ ప్రతిపాదనపై రష్యా ఎలా స్పందిస్తుందనేది కీలకం. ఎందుకంటే ఏ కాల్పుల విరమణ ఒప్పందం అయినా ప్రత్యర్థివర్గాల మధ్య కుదురుతుంది. కానీ ఇది ఓ పక్షం, మధ్యవర్తిత్వం వహిస్తున్న మరోదేశం మధ్య కుదిరిన ఒప్పందం కావడం గమనార్హం.
తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం లాంటి అదనపు డిమాండ్లు ఏవీ లేకుండా పుతిన్ దీనికి అంగీకరిస్తారా అనేదే ప్రశ్న. రష్యాఉక్రెయిన్ మధ్యనాలుగేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాకు చెందిన వ్యక్తులు, కంపెనీలకు చెందిన వందల కోట్ల ఆస్తులపై ఆంక్షలు విధించాయి.
అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి త్వరలోనే అమెరికా, రష్యా మధ్య చర్చలు జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు చెబతున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే నాలుగేళ్లుగా కొనసాగుతున్న మారణకాండకు త్వరలోనే శుభం కార్డు పడే అవకాశం ఉంది.