12-03-2025 12:00:00 AM
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా 2023లోనే భారత్ అవతరించడం, ప్రపంచ జనాభా లో ఆరవ వంతు భారతీయులే ఉండడం, భారతీయుల సగటు వయస్సు 28.4 ఏం డ్లుగా ఉండడంతో ముద్దుగా ‘యువభారత్’ అంటూ నోరారా పిలవడం చూస్తు న్నాం.
అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా అవతరిస్తూ ఉజ్వల భవిష్యత్తును కలిగిన దేశంగా నిలుస్తూ, (2011 గణాంకాల ప్రకారం) దేశంలో అక్షరాస్యత రేటు 74.04 శాతం, ప్రాథమిక పాఠశాల స్థూల నమోదు నిష్పత్తి దాదాపు (జీఈఆర్) 100 శాతంగా, ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (2021-22 ప్రకారం) 28.4 శాతం నమోదు కావడం చూస్తున్నాం.
భారత ప్ర భుత్వ లక్ష్యాల ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్ 50 శాతానికి చేర్చడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. 2021-22లో యూనివర్సిటీ విద్య లో 4.43 కోట్లుగా ఉన్న నమోదును 9 కో ట్లకు పెంచడానికి ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల సంఖ్యను సైతం రెట్టింపు చేయవ లసిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ యువతను నైపు ణ్యం కలిగిన విద్యావంతులుగా మార్చడంలో విజయం సాధిస్తే 2047 నాటికి మన దేశం ‘వికసిత్ భారత్’ స్థాయికి ఎదుగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
భారత్‌లో ఉన్నత విద్యాసంస్థలు
2022 గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 1,160 యూనివర్సిటీలు ఉన్నా యి. ఇందులో 52 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 808 రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాల యాలు, 152 జాతీయ స్థాయి విద్యా సంస్థ లు, 6 రాష్ట్ర స్థాయి సంస్థలు ఉన్నాయి. మన దేశంలో 418 ప్రభుత్వ యూనివర్సిటీలు, 390 ప్రైవేట్ యూనివర్సిటీలు, 80 ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు, 44 ప్రభు త్వ డీమ్డ్ యూనివర్సిటీలు, 18 ఓపెన్ యూనివర్సిటీలు (ఇందులో ఒక్కటి మా త్రమే ప్రైవేట్) ఉన్నాయి.
అంటే దాదాపు 470 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండగా, దాదాపు 530 ప్రభుత్వ (రాష్ట్ర/కేంద్ర) యూనివర్సిటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,160 యూనివర్సిటీల్లో 680 పట్టణ ప్రాంతాల్లో, 480 గ్రామీణ ప్రాం తాల్లో ఉన్నాయి. మన దేశ జనాభాలో 66 శాతం గ్రామీణంలో ఉండగా 41 శాతం యూనివర్సిటీలు మాత్రమే ఆ ప్రాంతాల్లో ఉన్నాయి.
పట్టణ ప్రాంతాల్లో 34 శాతం జనాభా ఉండగా 59 శాతం యూనివర్సి టీలు ఈ పట్టణాల్లో నెలకొల్పడం జరిగిం ది. భారత్‌లోఉన్న 47,947 కళాశాలల్లో 60 శాతం గ్రామీణంలో, 40 శాతం పట్ట ణ ప్రాంతాల్లో ఉన్నాయి. అధిక యువత నివసించే గ్రామీణ ప్రాంతాల్లో యూనివర్సిటీలు, కాలేజీలు పెరిగితే గ్రామీణ యువత కూడా ఉన్నత విద్యాభ్యాసం వైపు మెగ్గుచూపే అవకాశం ఉంటుందని గమనించాలి.
రాష్ట్రాలు, పట్టణాల వారీగా...
దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో 93, గుజరాత్‌లో 91, యూపీలో 87 యూనివర్సిటీలు ఉండగా, అండమాన్ నికోబార్/లక్షద్వీప్/దాద్రా నగర్ హవేలి/డయ్యూ డమన్‌లో ఒక్క యూనివర్సిటీ కూడా లేకపోవడం విచారకరం. జనాభా ప్రాతిపదికన ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఎక్కువ ఉన్నత విద్యా సంస్థలు ఉండడం, యూపీ, బీహార్, ఏపీ, చత్తీస్‌గఢ్‌లో అధిక జనాభా ఉన్నప్పటికీ దానికి తగినట్లుగా కాకుండా తక్కువ వి ద్యా సంస్థలు ఉండడం గమనార్హం.
దేశవ్యాప్తంగా జిల్లాల వివరాలను గమనిస్తే అ త్యధికంగా జైపూర్ జిల్లాలో 35, బెంగుళూరులో 25, అహ్మదాబాద్ జిల్లాలో 21 యూనివర్సిటీలు ఉన్నాయి. మన దేశంలో ని 160 జిల్లాల్లో ఒక్క యూనివర్సిటీ మా త్రమే ఉండగా, దాదాపు 380 జిల్లాల్లో (ముఖ్యంగా యూపీ, ఎంపీ, ఈశాన్య రాష్ట్రాల్లో) ఒక్క యూనివర్సిటీ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
నగరాల వారీగా కాలేజీల్లో బెంగుళూరు అర్బన్‌లో1,118 కాలేజీలు, జైపూర్‌లో 740, పుణెలో 628 కాలేజీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేకపోవడం, 85 జిల్లాల్లో ఐదుకన్నా తక్కువ కాలేజీలు ఉండడం గమనిం చవచ్చు. ఆంధ్ర ప్రదేశ్‌లో 60 యూనివర్సిటీలు లేదా కేంద్రీయ స్వయంప్రతిపత్తి ఉ న్నత విద్యా సంస్థలు ఉన్నాయి. అదే విధం గా తెలంగాణలో 28 యూనివర్సిటీలు లేదాఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి.
ఉన్నత విద్యకు దూరంగా ..
హిమాలయన్, ఈశాన్య ప్రాంతాలకు చెందిన 14 యూటీ/రాష్ట్రాలకు చెందిన 169 జిల్లాల్లో యూనివర్సిటీలు, ఉన్నత వి ద్య బోధించే కళాశాలలు ఏర్పాటు చేయవలసిన అగత్యం ఏర్పడింది. ఈ ప్రాంతా ల్లో 167 యూనివర్సిటీలు, 2,293 కాలేజీలు ఉన్నాయి. ఈ మారుమూల ప్రాంతా ల్లో కెల్లా అత్యధికంగా డెహ్రడూన్‌లో 19 యూనివర్సిటీలు, 132 కాలేజీలు ఉన్నా యి.
ఇలాంటి మారుమూల ప్రాంతాలకు చెందిన 116 జిల్లాల్లో ఒక్క యూనివర్సిటీ కూడా లేకపోవడం, 23 జిల్లాల్లో ఒక్క కాలే జీ కూడా లేకపోవడం గమనార్హం. భారత ప్రభుత్వం గుర్తించిన ఆస్పిరేషనల్ (ఆకాంక్ష కలిగిన) 112 జిల్లాల్లో 74 జిల్లాల్లో యూనివర్సిటీలు లేకపోవడం, 43 జిల్లా ల్లో ఒక్క యూనివర్సిటీ మాత్రమే ఉండ డం గమనార్హం. ఈ వర్గంలో రాంచీలో మాత్రమే 18 యూనివర్సిటీలు ఉన్నాయి.
నూతన వర్సిటీల స్థాపనకు ఊతం
దేశవ్యాప్తంగా 2015-16లో 755 యూనివర్సిటీలు ఉండగా, 2022 నాటికి వాటి సంఖ్య 1,160కి పెరగడం జరిగింది. ప్రస్తుతం ఒక లక్ష (18 - 23 ఏండ్ల వయ సు) యువతకు 0.8 యూనివర్సిటీలు ఉండగా, 33 కళాశాలలు ఉన్నాయి. చండీగఢ్‌లో ఒక లక్ష యువతకు 17 యూని వర్సిటీలు ఉండగా, యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒకటికన్నా తక్కువగా న మోదు అయ్యాయి.
లక్ష యువ జనాభాకు అరుణాచల్‌లో 1,692 కాలేజీలు ఉండగా, ఛత్తీస్‌గఢ్,ఏపీల్లో ఒక్క కాలేజీ మాత్రమే ఉన్నది. ఉన్నత విద్యలో జీఈఆర్ 28.4 శాతం ఉండగా, ఇందులో మహిళలకు 28.5 శాతం, పురుషులకు 28.3 శాతంగా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు/యూటీల్లో జీఈఆర్ దేశ సగటు కన్నా తక్కువగా ఉండగా, తమిళనాడులో అత్యధికంగా 47 శాతం ఉన్నది. మొత్తంగా 10 రాష్ట్రాల్లో జీఈఆర్ ఒకటి కన్నా తక్కువగా నమోదు కావడం విచారకరం.
ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు
ఇప్పటికీ ఒక్క యూనివర్సిటీ కూడా లే ని మూడు యూటీల్లో యూనివర్సిటీలను నెలకొల్పడం లేదా ప్రస్తుత కళాశాలలకు స్వయంప్రతిపత్తి కల్పించడం లేదా డీమ్డ్ యూనివర్సిటీలుగా మార్చడం జరగాలి. ఒక్క యూనివర్సిటీ కూడా లేని 380 జి ల్లాల్లో నెలకొల్పిన కాలేజీలను అప్‌గ్రేడ్ చేయడం లేదా క్లస్టర్ యూనివర్సిటీలుగా మార్చడం సత్వరమే జరగాలి. నేడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పడం, మహిళా విద్యకు పెద్ద పీట వే యడం సత్వర అవసరంగా కనిపిస్తోంది.
నేడు సేవలు అందిస్తున్న యూనివర్సిటీ, కాలేజీలతో పాటు నూతనంగా నెలకొల్పే యూనివర్సిటీలు లేదా కాలేజీల్లో అన్ని ర కాలైన వసతులను కల్పించడం, విద్యతో పాటు నైపుణ్యాలను పెంచి పోషించడం జరగాలి. యువభారతాన్ని నైపుణ్య భారతంగా మార్చితేనే 2035 నాటికి 50 శాతా నికి జీఈఆర్ చేరడంతో పాటు 2047 నా టికి వికసిత్ భారత్ లక్ష్య సాధన కూడా సు సాధ్యం అవుతుంది.
మన దేశంలో 34 యూనివర్సిటీలు, 113 ఉన్నత విద్యా సంస్థ లు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాయి. మన దేశంలో 18 - 35 ఏండ్ల వయస్సు ఉన్న యువత 60 కోట్లు ఉన్నా రు. వారందరికీ ఉన్నత విద్య అందితే రా నున్న రోజుల్లో భారత భవిష్యత్తు ఘనంగా వెలుగొందుతుంది.
ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థలు లేని లేదా తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల విశిష్టత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సాంస్కృతిక వా రసత్వాలను కాపాడుకుంటూ ఉన్నత విద్య లో మన యువభారతం రాణిస్తూ, దేశ సుస్థిరాభివృద్ధికి బాటలు వేయాలి. ప్రపంచానికే మన నైపుణ్య యువ భారతం దారి దీపం కావాలని ఆకాంక్షిద్దాం.
వ్యాసకర్త సెల్: 9949700037