calender_icon.png 19 May, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచివారు రాజకీయాల్లోకి రావాలి

13-03-2025 12:00:00 AM

‘వికసిత్ భారత్’ లక్ష్యసాధన సులభతరం కావాలంటే ఆదర్శవంతమైన యువతరం దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా పిలుపునిచ్చారు. అప్పట్లో న్యూఢిల్లీలోని ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ జరిగిన ఒక ప్రదర్శన వేళ ఆయ న ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఊరికే డబ్బు, అధికారం కోసం ఎవరూ ఈ వృత్తిలోకి రానక్కర్లేదు.

దేశ విశాల ప్రయోజనాల సాధననే లక్ష్యంగా చేసుకుని ముందుకు రావాలి. అప్పుడే అనుకున్న బృహత్ లక్ష్యం నెరవేరుతుంది. భారతదేశాన్ని అద్భుత పురోగతి వైపు నడిపించేలా యువశక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధాని పిలుపు ఇచ్చారని కాదు కానీ, నిజానికి కూడా దేశ భక్తి గలవారంతా నీతి, నిజాయితీ, విలువల ప్రాతిపదికన ఆలోచించుకోవాలి. మంచివారు రాజకీయాలకు రాకపోవడం వల్ల చెడ్డవారు రాజ్యమేలుతున్నారు.

తమలో అంతర్లీనంగా ఉన్న నాయకత్వ సామర్థ్యాల ను పెంపొందించుకోవాలి. వాటిని రాజకీ య రంగంలో ఉపయోగించుకోవాలి. దేశంలోని సమకాలీన సవాళ్లపై వారి అవగాహన, వినూత్న స్ఫూర్తి, డిజిటల్ సాంకేతికతలతో వారికిగల శక్తి సామర్థ్యాలను నిజానికి విస్మరించలేని ఆస్తులుగా భావించాలి. సుమారు ఏడున్నర దశాబ్దాల భారత స్వాతంత్య్రం తర్వాత ఓటును బాధ్యతగా భావించే యువతరం సంఖ్య గణనీయంగా పెరిగింది.

లక్ష లాదిమంది యువ భారతీయులు తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకుంటున్న సన్నివేశాలు చూస్తున్నాం. గత జాతీయ పార్లమెంటరీ ఎన్నికలలో 18 సం వత్సరాల వయస్సుగల ఓటర్లు మొత్తం నమోదిత ఓటర్లలో దాదాపు 22.3 శాతం మంది ఉన్నట్టు అంచనా. బ్యాలెట్ బాక్స్‌పట్ల ఈ ఉత్సాహం అభ్యర్థులుగా యువతీయువకుల ప్రాతినిధ్యం లో ప్రతిబింబించడం లేదు.

దీనికి  కారణాలూ లేకపోలేదు. రాజకీయాలలో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిన మాట వాస్తవం. అయినప్పటికీ ప్రతీ దానిని డబ్బు తో ముడి పెట్టకూడదన్న పెద్దల మాటలు గుర్తుంచుకోవాలి. అభ్యుదయ భావాలుగల వారంతా ఒక్కతాటిపైకి వస్తే ధనప్రాబల్యాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు.

దేశంలో సమర్థులైన యువత కొరత ఏ మాత్రం లేదు. వారంతా కలిసి దేశదిశను ప్రభావితం చేయడానికి తగినంత బాధ్యత వహిస్తే, మన రాజకీయాల రూపురేఖలే మారిపోతాయి. అనుభవం లేని వ్యక్తులు అకస్మాత్తుగా రాజకీయాలలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు? అన్న నిరుత్సాహం పనికిరాదు. 

 గడీల ఛత్రపతి, హైదరాబాద్