28-08-2025 09:04:10 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): భూ భారతిలో వచ్చిన పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఎన్ ఐ సీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, ఆర్డివో సుబ్రహ్మణ్యంతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మండలాల వారీగా భూ భారతి పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి రెవెన్యూ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ లు కూడా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోందని, కాబట్టి ఎప్పటికప్పుడు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు సమయపాలన పాటించాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడానికి వీళ్లేదని, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని మండలాల్లో దరఖాస్థుల పరిష్కారం నెమ్మదిగా జరుగుతోందని వేగం పెంచాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి, విచారణ పూర్తయిన వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. మండలాల వారీగా తహసీల్దార్ లు దరఖాస్థులను పరిష్కారం చేసే వాటిని రివ్యూ చేయాలని సీ సెక్షన్ సూపరింటెండెంట్ కు సూచించారు. సమావేశం లో సీ సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ సునీత, అన్ని మండలాల తహసీల్దార్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.