calender_icon.png 29 August, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

28-08-2025 11:29:38 PM

50 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మంథని (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sree Harsha) మంథని మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించారు. మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎరువుల చెక్ పోస్ట్, మంథని మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ఏక్లాస్ పూర్ గ్రామంలో ఎంపిక చేసిన స్థలాన్ని, మంథని పట్టణ హెడ్ క్వార్టర్ లో ఉన్న పుష్కర ఘాట్ ను కలెక్టర్ సందర్శించారు. అనంతరం మంథని పురపాలక కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... అడవి సోమన పల్లి గ్రామంలో 223 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాగా 193 బేస్మెంట్, 90 గోడల స్థాయి, 60 స్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. చివరి దశలో ఉన్న 50 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా చెక్ పోస్ట్ వద్ద 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది షిఫ్ట్ పద్ధతిలో నియమించాలని,  అక్రమ యూరియా రవాణా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని అన్నారు. 

మంథని మున్సిపాలిటీ సంబంధించి ఏక్లాస్ పూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ లో సేగ్రిగేషన్ షెడ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు.  గోదావరి నదిలో భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న అవుట్ ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని పట్టణంలో చేపట్టిన మున్సిపల్ భవనం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.పట్టణంలో ఆస్తి పన్ను  వసూలు ఇంప్రూవ్ చేసుకోవాలని, వాణిజ్య వ్యాపార సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజులు 100 శాతం వసూలు చేయాలని అన్నారు. పట్టణంలో అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరిగిన వెంటనే కూల్చి వేయాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  నిమజ్జనం పాయింట్ వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకన్న, రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తహసిల్దార్ కుమార స్వామి, ఎంపిడిఓ శశి కళ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.