28-08-2025 08:55:53 PM
డాక్టర్ కోట నీలిమ
సనత్‌నగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు భారీ వరదను తట్టుకుని నిలబడిందని డాక్టర్ కోట నీలిమ(Dr. Kota Neelima) సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుందని.. ఈ క్రమంలోనే పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రాగా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిందన్నారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడిందన్నారు. ఈ ప్రాజెక్టు MFD 70,000 క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువని తెలిపారు. బుధవారం నాటి భారీ వరదను తట్టుకొని నిలబడటం… గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ, భావోద్వేగ సమయమని తెలిపారు.
కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు నిజాం చేతుల మీద శంకుస్థాపన జరిగింది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం ప్రాజెక్ట్ తీరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరినా 100 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టుకు ఏమి కాలేదని.. కానీ 6 ఏళ్ల క్రితం బిఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కొద్దిపాటి నీటి ప్రవాహానికే పగుళ్లు వచ్చాయని అన్నారు. ఆ పగుళ్ల మర్మమేంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అబద్దపు మాటలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేమని తాజా వర్షాలతో నిరూపితమైందని పరోక్షంగా బిఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇచ్చారు కోట నీలిమ.