11-11-2025 08:03:12 PM
జిల్లాలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలో డీసీపీ కరుణాకర్..
పెద్దపల్లి (విజయక్రాంతి): ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలో డీసీపీ కరుణాకర్ సూచించారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లిలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీలు గజ్జి కృష్ణ, మడత రమేష్ నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు నాకబంది నిర్వహించి వాహనాల తనిఖీలు చేపట్టారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదలు జరిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా ప్రధాన చౌరస్తాలతో పాటు వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన వస్తువులను జాగిలాలతో సోదాలు చేశారు. ఈ తనిఖీలలో డీసీపీ, ఏసీపీ లు, ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు బాంబు స్క్వాడ్, జాగిలాల బృందం పాల్గొన్నారు.