25-07-2025 12:32:55 AM
అత్యవసరమైతే డయల్ 100 కు ఫోన్ చేయాలి
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూలై 24 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు ఉధృతిని పరిశీలించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరి అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
కాలి నడకన వెళ్లేవారు, వాహనాలతో రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర జిల్లా ప్రజలకు సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. ఇలాంటి సమయంలో జాలర్లు, ప్రజలు చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. పశువులను కాయడానికి నదులు, వాగుల పరిసర ప్రాంతాల దగ్గరకు జాగ్రత్తగా వెళ్ళవద్దన్నారు.
జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు, చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ తరపున 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.