08-10-2025 07:42:54 PM
మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్..
హుజూర్ నగర్: క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లింగగిరి గ్రామంలో ఛాతీ ఎక్స్‌రే శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2025 నాటికి భారతదేశంలో క్షయవ్యాధి రహితంగా మార్చడం టీబీ ముక్త్ భారత్ లక్ష్యమన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, బరువు కోల్పోవడం, తేమడలో రక్తజీరలు, రాత్రి వేళల్లో జ్వరం వస్తున్నట్లయితే టీబీగా అనుమానించి వెంటనే పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా టీబీ పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎక్స్‌రే శిబిరంలో 147 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, నూర్జహాన్ బేగం, టీబీ కో-ఆర్డినేటర్ ప్రసాద్, మాధవరెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, ట్రీట్మెంట్ సూపర్వైజర్ మమత, అలివేలు మంగ, ప్రశాంతి, గ్రామ కార్యదర్శి సోహెల్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.