25-11-2025 07:47:27 PM
టీబీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.మంగళవారం హనుమకొండ న్యూ శాయంపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ నమోదు, ఫార్మసీ, ఆరోగ్య మహిళా రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంత జనాభా ఉంటుంది, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారు, స్క్రీనింగ్ ఎంత మందికి చేశారు, ఇంకా ఎంత మందికి చేయించాల్సి ఉంది.
ఎక్స్ రే పరీక్షలు, శాంపిల్స్ ఎంత మందికి చేయించారు. టెస్టు లు చేస్తున్నారా అని కలెక్టర్ అడుగగా వాటి వైద్యులు, సిబ్బంది వివరాలను తెలియజేశారు. ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్, స్టోర్ రూమ్, థియేటర్, ఫిమేల్ వార్డు, ఫార్మసీ గదులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం లో భవనం పునరుద్దరణ పనులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్ ఎలా నిర్వహిస్తున్నారనే వివరాలు వైద్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... టీబీ నియంత్రణకు వైద్యులు, సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టెస్టు లు, ఇతర పరీక్షలను నిర్వహించి వారికి సరైన మందులు, పౌష్టిక ఆహరం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించి కోలుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా వైద్య సేవల నిమిత్తం అక్కడికి వచ్చిన మహిళలతో కలెక్టర్ మాట్లాడి వైద్య సదుపాయాలు ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలందించాలన్నారు.