20-08-2024 12:30:00 AM
అత్యంత పరాక్రమవంతుడైన మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, పరాయి దేశాల దాడులను ఎదుర్కొనేందుకు 17వ శతాబ్దంలోనే ఎంతో దూరదృష్టితో సముద్ర యుద్ధతంత్రాలు, వ్యూహరచనలతో నావికాదళాన్ని స్థాపించి పటిష్టమైన నౌకాదళ స్థావరాలను నిర్మించినందుకు భారత ‘నౌకాదళ పితామహుడు’గా పేరొందాడు. ఆయన అద్వితీయమైన కృషి భవిష్యత్తులో భారతదేశంలో సముద్ర కార్యకలాపాలకు, అధ్యయనానికి పునాది వేసింది.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తమ వాణిజ్య నౌకల రక్షణకోసం 1612 సెప్టెంబర్ 5న భారతదేశంలో ఏర్పాటుచేసిన నౌకాదళం 1934 అక్టోబర్ 2 వరకు పలు పేర్లతో పిలవబడి, 1950న భారత గణతంత్ర రాజ్యంగా ఏర్పడే వరకు రాయల్ ఇండియన్ నేవీగా కొనసాగింది. పిదప ఇండియన్ నేవీగా మారింది. భారత నౌకాదళం మొత్తం 1,42,000 (7,000 ఇండియన్ నేవల్ ఎయిర్ ఆర్మ్, 1,200 మంది మెరైన్ కమాండోలు, 1,000 మంది సాగర్ ప్రహరీ బల్ సిబ్బందితో కలిపి)తో ముంబైలో పశ్చిమ, విశాఖపట్నంలో తూర్పు, కొచ్చిలో దక్షిణ నౌకాదళ కమాండ్లను నిర్వహిస్తున్నది.
నివారణ కీలకమైన అంశం
2000వ సంవత్సరంలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టబడిన గైడెడ్- మిసైల్ ఫ్రిగేట్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రకు 2024 జూలై 21న ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో మరమ్మతులు చేపడుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలలో ఒక వ్యక్తి మరణించినా నౌకను నిటారుగా నిలబెట్టలేకపోయిన విషయం మనకు తెలుసు. 1990 నుండి శాంతికాల సమయంలో భారత నౌకాదళం ఐదేళ్ళకో నౌకను కోల్పోయినట్లు ‘ఇండియా టుడే’ కథనంలో పేర్కొంది.
2011 జనవరి నుండి 2014 నవంబర్ మధ్య కాలంలో 24 యుద్ధనౌకలు, జలాంతర్గాములు ప్రమాదాలకు గురైనట్లు 2014లో నాటి రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అంతేకాదు, 2004 నుండి ప్రతి రెండేళ్లకో నౌకాదళ యోధుడిని భారత నౌకాదళం కోల్పోవడం విషాదకరం. శాంతికాల సమయంలో యుద్ధనౌకల నష్టాలు సర్వసాధారణమైనప్పటికీ అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలు వాటిని తట్టుకునే ఆర్థిక స్థితిలో లేవు. అందువల్ల ప్రమాదాల నివారణ భారత నౌకాదళానికి చాలా కీలకమైన అంశం.
7వ స్థానంలో ఇండియన్ నేవీ
‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ వార్ షిప్స్’ ప్రకటించిన గ్లోబల్ నేవల్ పవర్ ర్యాంకింగ్స్- 2024 నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. భారత నౌకాదళంలోని నౌకలను ప్రధానంగా ఏడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి విమాన వాహక నౌకలు (ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్స్), డిస్ట్రాయర్లు, -ఫ్రిగేట్లు, -కొర్వెట్లు, జలాంతర్గాములు (సబ్‌మెరైన్స్), -గస్తీ నౌకలు (పెట్రోల్ వెసల్స్), - ఉభయచర యుద్ధ నౌకలు (ఆంఫీబియస్ వార్‌ఫేర్ షిప్స్).
2024 ఏప్రిల్ నాటికి భారత నౌకాదళంలోని మొత్తం 294 నౌకలలో 2 విమాన వాహకాలు, 1 ఉభయచర రవాణా డాక్, 9 ల్యాండింగ్ షిప్ ట్యాంకులు, 12 డిస్ట్రాయర్లు, 12 యుద్ధనౌకలు, 1 అణుశక్తితో నడిచే అటాక్ సబ్‌మెరైన్, 17 సాంప్రదాయకంగా నడిచే అటాక్ సబ్‌మెరైన్లు, 6 ప్రతిఘటన నౌకలు, 4 ఫ్లీట్ ట్యాంకర్లు, 137 పెట్రోలింగ్ నౌకలు ఉన్నాయి. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటానికి భారత నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉంటూ జాతీయ భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. అంతేకాదు, భారతదేశ వ్యూహాత్మక నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో తయారైన అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ విస్తృత పరీక్షలు పూర్తి చేసుకుని 2024 అక్టోబర్‌లో భారత నౌకాదళంలో చేరడానికి సిద్ధంగా ఉంది.
ప్రమాదాలకు మూల కారణాలు
భద్రతా ప్రమాణాలను పాటించే విషయంలో 2014 వరకు కూడా భారత నౌ కాదళంలో పటిష్టమైన సంస్థాగత కార్యాచరణ అందుబాటులో లేదు. కాలం చెల్లిన యుద్ధనౌకలు, నిర్వహణకు సంబంధించి నిర్దిష్టమైన నియమాలున్నా సమయానుసారం మరమ్మతులు చేపట్టడంలో అలస త్వం ప్రదర్శించారు. కొనుగోళ్ల ఆమోదం పొందడంలో రక్షణశాఖలో పరిపాలనాపరమైన కాలయాపన, పలు సందర్భాలలో మానవ తప్పిదాలు వంటివన్నీ ప్రమాదాలకు సాధారణ కారణాలని చెప్పవచ్చు. సహజంగా నిరంతరం చలిస్తూండే యుద్ధనౌకలలోని త్వరగా మండే స్వభావం గల పదార్థాలు, అధిక- వోల్టేజ్ విద్యుత్ పరికరాలు, వాతావరణ పరిస్థితులు, అలల తా కిడులు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రౌండింగ్ పరిస్థితులు నౌకా ప్రమాదాలకు ప్రధానంగా కారణమవుతున్నాయి.
అయితే, ప్రపంచంలోని భారీ నౌకాదళాల్లో ఒకటైన భారతదేశపు యుద్ధనౌకలు ప్రతి సంవత్సరం సముద్రంలో 12,000 నౌకాదినా లపాటు విభిన్న సముద్ర జలాలు, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి రావ డంతో కొన్ని ప్రమాదాలు సంభవించడం సర్వసాధారణమని నావికారంగ నిపుణుల అభిప్రాయం. ప్రమాదాల అనంతరం చేపట్టిన విచారణలో మానవ తప్పిదాలు జరిగినట్లు రుజువైన సందర్భాల్లో సంబంధిత కమాండ్లనుండి ఆయా నౌకల కెప్టెన్లు తొలగింపబడ్డారు. ఐఎన్‌ఎస్ సింధురత్న (ఎస్59)లో జరిగిన ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ 2014 ఫిబ్రవరి 26న నాటి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, అడ్మిరల్ డికె జోషి తన పదవికి రాజీనామా చేశారు.
యుద్ధనౌకలు లేదా జలాంతర్గాముల కొనుగోలు, నిర్మాణం భారత నౌకాదళానికి అత్యంత ఖర్చు, వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమే కాదు ఒక్కో యుద్ధనౌక లేదా జలాంతర్గామి నిర్మాణానికి ఎనిమిది నుండి పదేళ్ల సమయం ప డుతుంది. యుద్ధాలు లేని శాంతికాల సమయంలో యుద్ధ నౌకల నిర్వహణను సమ ర్థవంతంగా, ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులను చేపడుతూ ప్రమాదాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతోపాటు భద్రతాంశాలపై ఎలాం టి రాజీ లేకుండా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగాలి.
హిందూ సాగరంపై ఆధిపత్య పోరు
హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా కొన్ని దశాబ్దాలుగా తన నేవీని వేగంగా ఆధునీకరిస్తున్నది. భారత్-, చైనాల మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న సరిహద్దు వివాదంతోపాటు ప్రత్యేకించి 2020లో గాల్వన్ లోయవద్ద ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఆఫ్రికాలోని జిబౌటీ, పాకిస్థాన్‌లో ని గ్వాదర్‌లో ఓడరేవులను నిర్మించడం సహా శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టును 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకాదళ పరిధిని పెంచుకోవడానికి ఈ పోర్టులు చైనాకు ఎంతో ఉపయోగపడతాయి.
ఈ విషయంపై రక్షణరంగ నిపుణుడు, భారత నౌకాదళంలో ఉన్నత అధికారిగా రిటైరైన తరువాత ఢిల్లీలోని సొసైటీ ఆఫ్ పాలసీ స్టడీస్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్న సీ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, ఈ పరిణామం ‘ప్రమాదం’ అనేకంటే ఒక శాశ్వత సవాలు లాంటిదని, ఓడరేవుల నిర్మాణం, మౌలిక వసతుల పెంపు సముద్రాలమీద చైనాకున్న బలానికి నిదర్శనంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరగడం భారత్‌కు సహజంగానే గూఢచర్య పరంగా ఆందోళన కలిగించే అంశం. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో తన ఆస్తులతోపాటు సిబ్బందినీ పరిరక్షించుకోవడం భారత నౌకాదళం ముందున్న తక్షణ కర్తవ్యం.
- వ్యాసకర్త మాజీ రాష్ట్ర కార్యదర్శి
‘ది భారత్ స్కౌట్స్ గైడ్స్’, తెలంగాణ
సెల్: 8885050822