calender_icon.png 12 May, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెడుతున్న మంకీపాక్స్

20-08-2024 12:30:00 AM

నాలుగేళ్ల క్రితం కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మధ్య ఆఫ్రికాలో శరవేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్(ఎంపాక్స్)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెల 14న  గ్లోబల్ హెల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.ఈ ప్రాణాంతక వైరస్ శరవేగంగా ఇతర ఆఫ్రికా దేశాలకు, ఆ ఖండాన్ని దాటి స్వీడన్, పాకిస్థాన్ తదితర దేశాలకు విస్తరించడంతో డబ్ల్యూహెచ్‌ఓ ఈ హెచ్చరిక చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఫ్రికా దేశాల్లో ఈ వైరస్ బారిన పడి 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో అత్యధికులు గత ఏడాదినుంచి ఈ వ్యాధి వ్యాప్తిచెందుతున్న  కాంగో దేశానికి చెందిన వారే .

ఈ ఏడాది  ప్రపంచంలో నమోదయిన 17 వేల పైబడిన ఎంపాక్స్‌కేసుల్లో దాదాపు 97 శాతం ఈ దేశంలో నమోదయినవే కావడం గమనార్హం. భారత్‌లో ఇప్పటివరకు ఈ వైరస్‌కు సంబంధించిన కేసులేవీ బయటపడకపోయినప్పటికీ ప్రభుత్వం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ వస్తోంది. ఎందుంటే కొవిడ్ మహమ్మారి సమయంలో మన ఆరోగ్య వ్యవస్థలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఆ మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారిఅలాంటి పరిస్థితి ఎదురు కాకూడదనే అందరూ కోరుకుంటున్నారు. అయితే ఎంపాక్స్ కొవిడ్19 లేదా స్వైన్‌ఫ్లూ వైరస్ అంత ప్రాణాంతకమైనదా? అంటే అంత తీవ్రమైనది కాకపోవచ్చు కానీ ఇది కూడా వేగంగా విస్తరించే వైరస్. ఈ వైరస్ సోకిన ప్రతి పది మందిలో ఒకరు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

గతంలో కూడా ఈ వైరస్ ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. అందులో రెండు రకాలను అప్పట్లో గుర్తించారు. వాటిలో మొదటిది క్లాడ్ 1 ప్రమాదకరమైనది కాగా రెండోదానిలో వ్యాధిలక్షణాలు అంత తీవ్రంగా కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన క్లాడ్1బి వైరస్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారి గుర్తించారు. మంకీపాక్స్ కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్ వ్యాధి అంటే జంతువులనుంచి మనుషులకు సోకుతుంది.

మనుషులనుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారికి అతి దగ్గరగా ఉండడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి మూడు వారాలు కూడా పట్టవచ్చు.ఈ వైరస్‌ను 1958లో మొదట కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు.1970 దశకంలో తొలిసారి ఇది మనుషుల్లో బైటపడింది.

జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి , అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే  ముఖం, కాళ్లు, చేతులపై దద్దుర్లు  ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే  ప్రమాదముంది. మంకీపాక్స్‌కు ఇప్పటివరకు కచ్చితమైన చికిత్స లేదు. అయితే ఈ వ్యాధిని నియంత్రించడానికి  వైద్యులు యాంటీవైరల్ మందులు ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్ వ్యాక్సీన్ మంకీపాక్స్ చికిత్సలో 85 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

అమెరికా జిన్నెయోస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోంది. ఇక వ్యాధి ప్రబలకుండా ఉండడానికి కొవిడ్ ఇన్షెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్, అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం లాంటి కొన్ని సిఫార్సులను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వైరస్ కొవిడ్19 అంత ప్రమాదకారి కానప్పటికీ ఆ అనుభవాల దృష్ట్యా అన్ని దేశాలు కూడా ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కూడా. కొవిడ్ తరహాలో వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు, అది సోకిన వారికి మెరుగైన చికిత్స అందించడం ఒక్కటే దీనికి తరుణోపాయం.