28-09-2025 05:01:06 PM
జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఈ. శంకర్
బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రస్తుతం అత్యంత ప్రమాదకమైన రేబిస్ వ్యాధిపై ప్రజలు, పెంపుడు కుక్కల యజమానులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఈ.శంకర్ సూచించారు. ఆదివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పశు వైద్యశాల వద్ద పశు వైద్యాధికారి డాక్టర్ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ రేబిస్ వ్యాక్సినేషన్ శిబిరంలో పాల్గొని పెంపుడు కుక్కల యజమానులకు రేబిస్ వ్యాధి సంక్రమణ పట్ల అవగాహన కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధికి టీకా అందుబాటులో ఉందని చెప్పారు.
ప్రజల్లో రేబిస్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల కుక్క కాటు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.కుక్క కాటు వల్ల మనుషులతో పాటు ఇతర జంతువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. పెంపుడు కుక్కలకు సమయానికి రేబిస్ టీకా వేయిస్తే ఈ వ్యాధి నుండి రక్షించవచ్చని సూచించారు. అనంతరం పశు వైద్యశాల వద్ద పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ పి. శ్రావణ్, గోపాలమిత్ర సభ్యులు తిరుపతి, వెంకటేష్, ప్రశాంత్ లు పాల్గొన్నారు.