calender_icon.png 28 September, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేబిస్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి

28-09-2025 04:59:42 PM

మండల పశు వైద్యాధికారి తిరుపతి

మందమర్రి (విజయక్రాంతి): ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల పశు వైద్యాధికారి తిరుపతి అన్నారు. మండల కేంద్రంలోని మందమర్రి (వి) ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఆదివారం ప్రపంచ రేబీస్ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని పెంపుడు జంతువుల యజమానులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రేబిస్ వ్యాధికి టీకా మందు కనిపెట్టిన ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 28 న "ప్రపంచ రేబీస్ దినోత్సవం" ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రేబీస్ టీకా అందుబాటులో ఉందని, 100% రెబీస్ వ్యాధి నుండి కాపాడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 59,000 మంది ప్రజలు రేబీస్ వ్యాధి తో మరణిస్తున్నారన్నారు.

ప్రజల్లో రేబీస్ వ్యాధిపై అవగాహన లేకపోవడం నిర్లక్ష్యం మూలంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేబీస్ వ్యాధిపై ప్రజల్లో  అవగాహన కల్పించి, పెంపుడు జంతువులను కాపాడుకోవాలని, కుక్కకాటు ద్వారా రేబీస్ వ్యాధి మనుషులకు, ఇతర జంతువులకు విస్తరిస్తుందని, సమయానికి టీకా మందు వేయడం వలన వ్యాధిని పూర్తిగా నివారించవచ్చన్నారు. ఈ సందర్భంగా 65 కుక్కలకు ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ అధికారి కృష్ణవేణి, గోపాల మిత్రులు పానుగంటి శ్రీనివాస్, చెన్నయ్య, మంచికట్ల రమేష్, రాయమల్లు, పెంపుడు జంతువుల యజమానులు పాల్గొన్నారు.