28-09-2025 05:26:37 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడలో ప్రభుత్వ విప్ కుమారుని కార్తీక్ సేవా కార్యక్రమం శాలువలను గౌన్లుగా మలిచి నిరుపేద చిన్నారులకు పంపిణీ వేములవాడ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వివిధ సందర్భాల్లో ఆది శ్రీనివాస్‌కు వచ్చిన శాలువలను పేరుతో చిన్నారుల కోసం గౌన్లుగా కుట్టించి పంపిణీ చేయడం జరిగింది. వేములవాడ పట్టణంలోని పలు కాలనీలలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ పాల్గొని గౌన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి వచ్చిన శాలువలను గౌన్లుగా మలిచి పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
మా కుమారుడు ఆది కార్తీక్ ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టామని, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆది కార్తీక్‌ను అభినందిస్తున్నామని అన్నారు. గౌరవార్థం వచ్చిన శాలువలను సేవాభావంతో గౌన్లుగా మలిచి పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, వీటిని తయారు చేసే ప్రక్రియలో పలువురికి ఉపాధి లభిస్తోందని, శాలువలు ఉపయోగంలోకి రావడం పట్ల తృప్తి కలుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని, ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.