28-09-2025 05:21:59 PM
అలుగు పోస్తున్న బునాదిగాని చెరువు
ఎమ్మెల్యే కుంభంకు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామం పరిధిలో గల బునాదిగాని చెరువు నిండితే తమకు సాగునీటి కష్టాలు తీరుతాయని రైతన్నలు ఏండ్ల తరబడి చేసిన నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారం బునాదిగాని చెరువు అలుగు పోస్తున్న ప్రాంతంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నీటిలో పూలుచల్లి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను తీర్చిన అపర భగీరథుడని అన్నారు. బునాది గాని చెరువు పూర్తిగా నిండడంతో అలుగు పోస్తుందని దీని ద్వారా రెడ్ల రేపాక చెరువు నిండుతుందని చెరువు నుండి కాల్వకు నీటిని విడుదల చేసినట్లయితే కంచనపల్లి, పులిగిల్ల ఇతర గ్రామాల్లోని చెరువులు నిండుతాయని ఈ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలవుతుందని అన్నారు. ఈ ప్రాంత రైతాంగ సమస్యను తీర్చిన కుంభం అనిల్ కుమార్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేసు బుచ్చిరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్, కాసుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.