25-09-2025 01:12:33 AM
హైదరాబాద్ (24) : ‘బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా..? ఏ అంశాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారు.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కోర్టులో పిటిషన్ వేయడం సరికాదు.. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మేం వాటిని పరిగణలోకి తీసుకోలేం’ అని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అర్హతను నిలదీస్తూ బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం కొట్టివేసింది.
ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమంటూ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్టంలోని 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుటెంగా మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు పిటిషన్ దాఖలు చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియ స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50శాతం దాటుతాయని ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పైవిధంగా స్పందిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.