calender_icon.png 27 July, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరపైకి పీజీ మెడికల్ సీట్ల స్కాం

25-07-2025 02:28:34 AM

  1.    2022లో కాలోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పీఎస్‌లో ఫిర్యాదు 
  2. దీని ఆధారంగా ఈడీ ఎంట్రీ 
  3. తాజాగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్‌కు నోటీసు 

మేడ్చల్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో గతంలో జరిగిన పీజీ మెడికల్ సీట్ల స్కాం విచారణ మళ్లీ తెరమీదకు వచ్చింది. పీజీ సీట్లలో యాజమాన్యాలు అవకతవకలకు పాల్పడ్డాయని కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

అప్పట్లో పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక అక్రమాలను గుర్తించింది. కన్వీనర్ కోట పీజీ సీట్లను బ్లాక్ చేసి ఆ తర్వాత విక్రయించినట్లు తేలింది. స్కామ్‌లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కూడా ఒకటిగా ఈడీ గుర్తించింది.

అప్పట్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి నివాసంలో సోదాలు చేసి కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్కులు ఈడీ స్వాధీనం చేసుకుంది. 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ సమయంలో మల్లారెడ్డి కాలేజీకి చెందిన రూ.2.89 కోట్ల విలువచేసే ఆస్తులు అటాచ్ చేసింది. 

నోటీసు అందజేసిన పోలీసులు 

వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విచారణ జరుగుతోంది. గురువారం పోలీసులు మల్లారెడ్డి కాలేజీ డైరెక్టర్ భద్రారెడ్డి ఇంటికి వచ్చి నోటీసు అందజేశారు. ఆ సమయంలో భద్రారెడ్డి లేకపోవడంతో ఆయన భార్య ప్రీతిరెడ్డికి అందజేశారు. పిలిచినప్పుడు విచారణకు రావాలని పేర్కొన్నారు. ముగ్గురు పోలీసులు వచ్చినట్లు తెలిసింది.