27-07-2025 09:37:21 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సీహెచ్సీ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి(District Additional Collector Venkat Reddy) ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి సేవలు, ఆస్పత్రికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో చికిత్స పొందుతున్న పేషంట్లతో వైద్య సదుపాయాలను అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వైద్య సేవలు నిమిత్తం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సీహెచ్సీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయం సందర్శన
కమలాపూర్ లోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సందర్శించారు. కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను ఆన్లైన్ చేస్తుండగా ఆ ప్రక్రియను పరిశీలించి వాటి వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భూభారతి దరఖాస్తులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి
భూభారతి దరఖాస్తులను ఆన్లైన్ చేసిన తర్వాత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం హసన్ పర్తి తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఆన్లైన్ చేసిన భూభారతి దరఖాస్తులను గురించి స్థానిక తహసిల్దార్ చల్లా ప్రసాద్ ను అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, భూభారతి దరఖాస్తులు ఆన్లైన్ పూర్తయిన వెంటనే సంబంధిత రైతులకు నోటీసులు అందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చల్లా ప్రసాద్, నాయబ్ తహసిల్దార్ రహీం పాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గురుకుల విద్యాలయం సందర్శన
హసన్పర్తి ఎర్రగట్టు గుట్ట సమీపంలోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. పలు తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. వంటగదిని తనిఖీ చేసి విద్యార్థినులకు వండుతున్న భోజన పదార్థాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ లోని బియ్యం తదితర వస్తువులను తనిఖీ చేశారు.
పరీక్షా కేంద్రం సందర్శన
హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న గ్రామ పాలన అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి వాటి వివరాలను అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.