06-08-2025 11:05:22 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కోళ్లు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, బర్రెలను అపహరించడం ఇప్పటివరకు చూసాం. అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా(Mahbubabad District) కేసముద్రం బల్దియా పరిధిలో 30 పందులను అపహరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బాధితుడు శివరాత్రి సతీష్ కథనం ప్రకారం... తాను ఐదేళ్లుగా పెంచుకుంటున్న 30 పందులను దొడ్డిలో మంగళవారం రాత్రి ఉంచానన్నారు. బుధవారం తెల్లవారుజామున పందులను దొడ్డి నుండి వదిలి పెట్టేందుకు వెళ్ళగా అవి కనిపించలేదని వాపోయాడు. పందులను అపహరించడం వల్ల తనకు సుమారు నాలుగు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పందుల అపహరణ ఘటనను కేసముద్రం పట్టణంలో విచిత్రంగా చెప్పుకుంటున్నారు.