calender_icon.png 28 May, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

27-05-2025 10:21:56 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం జిల్లాలోని వేమనపల్లి మండలం నీల్వాయి, గొర్లపల్లి, వేమనపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ సంధ్యారాణితో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న అకాల వర్షాల పరిస్థితులలో కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. సన్న రకం వడ్లు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ. 500 రూపాయల అదనపు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల కోసం త్రాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉoచడంతో పాటు అవసరమైన గోనెసంచులు, టార్పాలిన్లను సమకూర్చడం జరిగిందని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వారికి కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.