23-07-2025 12:07:07 AM
ఖైరతాబాద్, జూలై 22: తన కవితలు, రచనలతో ప్రజల్లో పోరాట చైతన్యం నింపిన కవి దాశరథి కృష్ణమాచార్యులు అని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ అన్నారు. దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అందుకున్నారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రచయితలు అందెశ్రీ, జయరాజ్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ మాజీ అధ్యక్షుడు యాకూబ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గోసని, యాసని, జీవనశైలిని తన కవిత్వం ద్వారా ప్రపంచానికి చాటి చప్పిన గొప్ప కవి దాశరథి అని కొనియాడారు.
తెలంగాణ ప్రజా ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన అన్ని ప్రజా పోరాటాల్లో ముందుండి తన కవితల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన గొప్ప సాహితీమూర్తి దాశరథి అన్నారు. తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక రంగానికి దాశరథి ఐకాన్ అని కొనియాడారు.
ఆయన ఆలోచన విధానం ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతో మంది కవులు రావాలని కోరారు. కార్యక్రమంలో దాశరథి కుటుంబ సభ్యులు ఇందిర, లక్ష్మణ్, గౌరీశంకర్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.