24-07-2025 10:54:49 PM
నార్సింగి/చేగుంట (విజయక్రాంతి): ఉద్దేశ్యపూర్వకంగా లారితో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమై పారిపోయిన లారీ డ్రైవర్ ను కాపు కాసి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రామాయంపేట సీఐ ఆశం వెంకటరాజు కథనం ప్రకారం.. ఈనెల 23న సత్తిరెడ్డి అనే వ్యక్తి తన బంధువులతో పాటు ఆల్టో కారులో బంధువుల అంత్యక్రియలలో పాల్గొని తిరిగి వెళుతున్న క్రమంలో మధ్యాహ్నం నార్సింగి మండల పరిధిలోని జాతీయ రహదారి 44 వల్లూరు వద్దకు చేరుకోగా వెనుక వైపు నుంచి లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా లారీని నడుపుతూ కారును ఢీకొట్టి పారిపోయాడు. కారును ఢీకొట్టి ఆపకుండా పారిపోతున్న లారీని వెంబడించి వల్లూరు బస్టాప్ వద్ద సత్తిరెడ్డి, సోదరుడు వెంకటరెడ్డి కారు దిగి ఆపుతుండగా, లారీ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా సత్తిరెడ్డిని ఢీకొట్టి పారిపోయాడు.
ఈ క్రమంలో సత్తిరెడ్డి రోడ్డుపై పడిపోవడంతో లారీ చక్రాలు అతని తలపై నుంచి వెళ్ళి తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మరణించాడు. ఇది గమనించిన కొందరు లారీని వెంబడించగా లారీ డ్రైవర్ తూప్రాన్ వద్ద లారీని వదిలి పారిపోయాడు. వదిలి వెళ్ళిన లారీని తిరిగి తీసుకు వెళ్ళడానికి అక్కడికి వచ్చిన లారీ డ్రైవర్లు మెయిన్, హాసన్ (రాజస్థాన్ వాసులు) లను అక్కడే మాటు వేసి ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకొని, లారీని స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ వెంకటరాజు, నార్సింగి ఎస్ఐ బీ. సృజన, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, కానిస్టేబుల్ సాజిద్ అలీ, రాజు, కరుణాకర్, ఖాజా జహంగీర్ లను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.