calender_icon.png 16 August, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ తెరతీస్తే..

16-08-2025 01:00:37 AM

లోన్ యాప్‌లు మొదలుకొని 

బెట్టింగ్ యాప్ వరకు ప్రలోభాలే..

* ప్రస్తుత పరిస్థితులు కాదేదీ మోసానికి అనర్హం అన్నట్లుగా మారాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టా ప్‌లు, బిట్‌కాయిన్స్, ఏఐ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో లోన్ యాప్‌లు మొదలుకొని బెట్టింగ్ యాప్ వరకు జేబుకు చిల్లులు పొడి చేందుకు.. అంతా లీగల్ అని భ్రమింపజేసి కుటుంబాలనే కూల్చే దరిద్రపు సాంకేతికతలు చుట్టుముట్టాయి.

ఇక సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతేలేదు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారులకు పనిని సులభతరం చేయడంతోపాటూ  సమస్యలనూ తెచ్చిపెడుతున్నది. ఆధునిక టెక్నాలజీ ఆవలి కోణం అంతులేని వ్యథను మిగుల్చుతున్నది. వేలు, లక్షల సొమ్ము దోపిడీకి గురవుతున్నది.

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ప్రపంచంలో అధిక సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను తయారు చేస్తున్న భారత్‌లో సైబర్ నేరగాళ్లు ఈ దేశ యువతను టార్గెట్ చేస్తున్నారు. దాదాపు 45 కోట్ల మంది వద్ద  స్మార్ట్‌ఫోన్ ఉండడంతో సైబర్ నేరగాళ్లు  ఈజీ మనీ కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమాయక యువతను, నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని వేల కోట్ల డబ్బును దోచుకుంటు న్నారు.

గతేడాది ఒక్క సంవత్సరంలోనే భారతీయులకు సంబంధించిన దాదాపు రూ.23 వేల కోట్ల సొమ్మును సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. సైబర్ మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త కొత్త మార్గాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరగాళ్లు సైబర్ సవాల్ విసురుతున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఆపరేట్ చేస్తూ సామాన్యుల ఖాతాల్లో ఉన్న డబ్బును ఖాళీ చేస్తున్నారు. 

సైబర్ నేరాలకు కారణం

గత మూడేళ్లుగా సైబర్ నేరాలు పెరిగిపోవడం.. వాటి వల్ల భారీగా డబ్బు కోల్పోవడానికి ప్రధాన కారణం డిజిటల్ పేమెంట్స్ సంఖ్య పెరగడమేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యూపీఐ పేమెంట్లు గత కొంతకాలంగా భారీగా పెరిగిపోయాయి. ఒక్క 20 25 జూన్ నెలలోనే యూపీఐ ద్వారానే రూ.24.03 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగిన ట్లు లెక్కలు చెబుతున్నాయి. గత 10 ఏళ్లలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

2013లో భారతదేశంలో రూ.1 62 కోట్లుగా ఉన్న డిజిటల్ పేమెంట్ల సంఖ్య.. 2025 జనవరి నాటికి రూ.18,120 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ పేమెంట్స్‌లో సగం చెల్లింపులు భారత్ లోనే జరగడం గమనార్హం. 2019 కరోనా మహమ్మారి సమయంలో మన దేశంలో యూపీఐ, డిజిటల్ పేమెంట్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

దీనివల్ల మారుమూల గ్రామాలకు కూడా డిజిటల్ పేమెంట్లు చేరేందుకు ఉపయోగపడింది. కరోనా తర్వాత చిరువ్యాపారుల వద్ద కూడా స్కాన్ చేసి పేమెంట్లు చేసే విధానాలు భారీ గా పెరిగిపోయాయి. అదే సమయంలో సైబ ర్ నేరగాళ్లు కూడా తమ పంజా విసురుతున్నారు. సైబర్ మోసాలు చేయడంలో మరిం త నైపుణ్యాన్ని పెంచుకుని ఆన్‌లైన్ వేదికగా తమ దోపిడీలను మరింత విస్తరించారు. 

పలు రకాల సైబర్ మోసాలు

1. బ్యాంక్ సంబంధిత మోసాలు..

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, డిజిటల్ పేమెంట్లు చేయాలంటే ముందుగా బ్యాంక్ అకౌంట్ ముఖ్యం. అన్ని సైబర్ మోసాలకు బ్యాంక్ అకౌంటే కీలకం. 2025--26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్ మోసా లు దాదాపు 8 రెట్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా 60 శాతం ఉన్నట్లు పేర్కొన్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల కస్టమర్లు భారీగా డబ్బులు నష్టపోయినట్లు వెల్లడించాయి. ఓటీపీ, బ్యాంక్ లింక్‌లను పంపి బాధితుల ఖాతా నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు.

2. ఇన్సూరెన్స్ మోసాలు

ప్రస్తుతం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా అన్ని సేవలు అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. మరీ ము ఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలు.. యాప్‌ల ద్వారా కస్టమర్లకు సేవలు అందిస్తుండటంతో.. ఇదే సైబర్ నేరగాళ్లకు ఒక అస్త్రంగా మారింది. ఇలా ఫేక్ యాప్‌లను తయారు చేసి కస్టమర్ల డబ్బులను దోచేస్తున్నారు.

3. పెట్టుబడుల మోసాలు

రూ.లక్ష పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే వాటిని రూ.10 లక్షలు చేసి చూపిస్తామని, పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు వచ్చేలా చేస్తామని చెప్పి మోసాలు చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలాంటి పెట్టుబడుల మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎప్ప టికప్పుడు అవగాహన కల్పిస్తున్నా చాలామంది మోసపోతున్నారు. ఇక పెట్టుబడి మోసాలకు చదువుకున్నవారు, ప్రభుత్వ, సా ఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా బలి కావడం ఇప్పు డు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

4.ఫిషింగ్ మెసేజ్‌లు

మీ పేరుతో గిఫ్ట్ వచ్చిందని, మీ ఫోన్ నం బర్ భారీగా నగదు బహుమతి గెలుచుకుందని, ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా లింక్‌లు పంపిస్తారు. అలాంటి లింక్‌లను క్లిక్ చేయగానే ఫోన్‌లో ఉన్న డేటా మొ త్తం చోరీ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు.

5. ఆన్‌లైన్ మార్కెటింగ్

బ్రాండెడ్ వస్తువులను అతి తక్కువ ధర కు అందిస్తామంటూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల లో భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ క స్టమర్లను ఆకర్షిస్తారు. అలా డబ్బులు కట్టించుకున్న తర్వాత ఎలాంటి వస్తువులు డెలి వరీ చేయకుండా వారిని మోసం చేస్తారు.

లోన్‌యాప్ పేరుతో

నిరుద్యోగులు, అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారికి లోన్‌యాప్‌లో ఆన్‌లైన్‌లోనే చిటికెలో రుణం ఇస్తున్నాయి. వీటిని వాయిదా రూపంలో చెల్లిస్తున్నటికీ అసలు, మిత్తీ మొత్తం కట్టినా కూడా లోన్‌యాప్‌లు బాధితులను వదలడం లేదు. ఇంకా అధిక మొత్తం కట్టాలంటూ బాధితులను వేధిస్తున్నాయి. ఒకవేళ నెలనెలా రుణం సమయా నికి చెల్లించకపోతే బాధితుడి ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్లకు, బంధువులకు ఫో న్ చేసి సదరు వ్యక్తి రుణం చెల్లించడం లేదని చెబుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నా యి. దీంతో లోన్ యాప్ వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

సోషల్ మీడియా అడ్డాగా 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లే టార్గెట్ గా అమాయకులను సైబర్ నేరగాళ్లు దోచే స్తున్నారు. సైబర్ నేరాలకు ఎక్కువగా వా ట్సాప్‌ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఒ క్క 2024 జనవరిలోనే వాట్సాప్‌లో 15 వే ల సైబర్ ఫ్రాడ్ ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తోంది. వాట్సాప్‌తోపాటు టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ మరో పెద్ద సమస్య ఏంటంటే.. తమ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సైబర్ నేరాలకు ఆయా సోషల్ మీడియా కంపెనీలు బాధ్యత వహించకపోవడం. అయితే సైబర్ నేరాలను అరిక ట్టేందుకు ప్రభుత్వాలు చట్టాలను ఎప్పటికప్పుడు కఠినతరం చేస్తూనే ఉన్నాయి.

తెలంగాణలో సైబర్ నేరాలు

తెలంగాణలో జరుగుతున్న సైబర్‌మోసాల్లో అత్యధిక బాధితులు ప్రైవేటు ఉద్యో గులే ఉండటం గమనార్హం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకుంటుం డ టం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో తెలంగాణలో సైబర్ నేరాలకు సంబంధించి 58,176 ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా సైబర్ పోలీసు లు 6,138 కేసులు నమోదు చేశారు. ఈ ఏ డాది రూ.681 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. 4,289 మంది ప్రైవేటు ఉద్యోగులను మోసం చేశారు.

వీరిలో 782 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. గతేడాది తో పోల్చితే ఈ ఏడాది మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా 37 శాతం సైబర్‌నేరాలు పెరగ్గా.. తెలంగాణలో 13 శాతం తగ్గిన ట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. 2025 లో ఇప్పటివరకు 228 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. వీరిలో 27 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

అరెస్ట్ అయినవారిలో తెలంగాణకు చెందినవారు 93 మంది ఉన్నారని, మిగితా వాళ్లు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారని తెలిపిం ది. అయితే సైబర్ నేరగాళ్లు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని, లేనిపక్షంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, మొబైల్ ఫోన్, కం ప్యూటర్లు జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. 

డిజిటల్ అరెస్ట్ స్కామ్

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో నేరస్తులు బాధితుడిని కాల్, ఈ మెయిల్ లేదా మెసేజ్ ద్వారా సంప్రదిస్తారు. మీపై చట్టపరమైన కేసు నమోదు అయిందని లేదా మీ అరెస్ట్ కోసం వారెంట్ జారీ అయిందని వారు పేర్కొంటారు. భయపెట్టడానికి అరెస్ట్ వారెంట్ లేదా కోర్టు సమన్లు వంటి నకిలీ పత్రాలను పంపడంతోపాటు వెంటనే జరిమానా చెల్లించాలని, బ్యాంక్ వివరాలను పంచుకోవాలని లేదా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో వారు వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఫిషింగ్ లింక్‌లను కూడా పంపుతారు.

కాల్స్, మెసేజెస్ లేదా ఈమెయిల్స్‌లో బెదిరింపు భాషను ఉపయోగిస్తే అప్రమత్తంగా ఉండం డి. మీరు వెంటనే జరిమానా చెల్లించమని లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయమని అడిగితే అది స్కామ్ కావచ్చు. పంపిన పత్రా లు సరైనవా కాదా అని ఎల్లప్పుడూ చెక్ చేస్తూనే ఉండండి. ఇటువంటి కాల్స్ లేదా మెసేజెస్ తరచుగా తెలియని లేదా ప్రైవేట్ నంబర్‌ల నుంచి వస్తాయి. ఏవైనా చట్టపరమైన విషయాల్లో సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

వ్యక్తిగత డేటాను ఇవ్వకూడదు

 మీ బ్యాంక్ వివరాలను లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా ఎప్పుడూ షేర్ చేయవద్దు. మీకు తెలియని లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దు. మీకు స్కామ్ అని అనుమానం వచ్చినట్లయిటే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజేయాలి. డిజిటల్ అరెస్ట్ స్కామ్ భయం, గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ప్రజలను మోసగించే మార్గం. మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటే ఇటువంటి మోసాలను నివారించవచ్చు. ఎల్లప్పుడూ అఫీషయల్ సోర్స్‌లను మాత్రమే విశ్వసించాలి. ఏదైనా తెలియని కాల్ లేదా మెసేజ్‌కి స్పందించే ముందు చెక్ చేసుకోండి.

బెట్టింగ్ యాప్‌లతో దారుణాలు 

ప్రసుత్వం అనేక అనర్థాలకు బెట్టింగ్ యాప్‌లే మూల కారణమవుతున్నాయి. వం దలాది బెట్టింగ్‌యాప్‌ల ద్వారా జూదం ఆ డుతూ అనేక మంది లక్షలు నష్టపోతున్నా రు. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక తెలు గు రాష్ట్రాల్లో అనేక మంది ఆత్మహత్యలు చే సుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే గడచిన ఏడాదిన్నరలో 24 మంది ఇలా ఆత్మహ త్య చేసుకోవడంతోనే పరిస్థితి అర్థమవుతున్నది.

కష్టపడకుండానే సంపాదించవచ్చని, పెట్టిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంద ని అనేక మంది వీటికి ఆకర్షితులవుతున్నా రు. ఒకసారి ఎక్కువ డబ్బు రాగానే మళ్లీమళ్లీ పెడుతున్నారు. మరి కొందరు లోన్‌యాప్‌ల నుంచి అప్పులు తీసుకుంటారు. బెట్టింగ్ యాప్‌లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల వరకు చేరుకున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు.

తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి అప్పులు కావడంతో తీర్చే మార్గం లేక భార్యాబిడ్డల్ని చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  బెట్టింగ్‌లకు అలవాటు పడిన వారు డబ్బు కోసం గొలుసు, సెల్‌ఫోన్ దొంగలుగా కూడా మారుతున్నారు. మరి కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. లోన్‌యాప్‌ల రుణాలు చెల్లించాల్సిన వారి పరిస్థితి కూడా ఇదే.

అలా బెట్టింగ్ వారిని నేరాల బాట వైపు సైతం నడిపిస్తోంది. కొందరు పని చేసే కంపెనీల డబ్బును సొంతానికి వాడుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు డి ప్యూటీ మేనేజర్ పని చేస్తున్న బ్యాంకును బు రిడీ కొట్టించి ఏకంగా 8.5 కోట్ల రూపాయ లు కొల్లగొట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలు, కుటుంబాలు ఆగమవుతున్నాయి.

సెలబ్రిటీల ప్రమోషన్... ఈడీ కేసు నమోదు 

కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా తెలంగాణలోని కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, యూట్యూబర్‌లతోపాటు పలురువు సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేశారు. వీరిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల, టీవీ హోస్ట్ శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణీ సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషాయనీ సుప్రీతపై ఈడీ కేసు నమోదైంది.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో వీరి పాత్రను పరిశీలించే దిశగా ఈడీ విచారణ చేపట్టింది. సెలబ్రిటీస్ తమ లాభార్జన కోసం జంగ్లీ రమ్మీ, జీట్‌విన్, లోటస్365, ఫెయిర్ ప్లే లైవ్, పరిమ్యాచ్, యోలో 247, ఏ23 వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ఎండార్స్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

దేశవ్యాప్తంగా రూ. 110 కోట్లు ఫ్రీజ్ 

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ పరిమ్యాచ్ కేసులో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 17 చోట్ల ఈడీ సో దాలు చేపట్టింది. హైదరాబాద్‌తోపా టు ముంబై, సూరత్, ఢిల్లీ, నోయి డా, జైపూర్, మధురై, కాన్పుర్‌ల్లోనూ సోదాలు జరిగాయి. ఈ సం దర్భంగా పలు బ్యాంకు ఖాతాల్లోని రూ. 110 కోట్లు ఫ్రీజ చేశారు. డిజిటల్ డాక్యుమెంట్లు, మ్యూల్ ఖాతా ల డెబిట్, క్రెడిట్ కార్డులు, డిజిటల్ పరికరాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

ముంబై సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో పరిమ్యాచ్ డాట్‌కామ్‌పై నమోదైన కేసు ఆధారంగా మరో కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆన్‌లైన బెట్టింగ్ నిర్వాహకులు పెట్టుబడి పెట్టిన వారి నుంచి ఏడాదిలో రూ. 3 వేల కోట్లు కాజేసినట్టు ఈడీ పేర్కొంది. మ్యూల్ ఖాతాల్లో నగదు ఉంచి తమిళనాడు మధురైల్లో భారీ గా నగదు విత్‌డ్రా చేసినట్టు గుర్తించింది. హవాలా రూపంలో డబ్బు ను యూకేకి పంపి అక్కడ క్రిప్టో కరెన్సీగా మార్చినట్టు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. 

సైబర్ నేరాల్లో చిక్కుకోకూడదంటే... 

* డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

* బ్యాంక్ వివరాలు, ఓటీపీ, సీవీవీ నంబర్లు, యూపీఐ పిన్, పాస్‌వర్డ్‌లు వంటి పర్సనల్ డేటాను ఎవరితోనూ పంచుకోవద్దు.

Fసోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీల గురించి చర్చించవద్దు.

* లాటరీ, గిఫ్ట్‌లు వచ్చాయంటూ వచ్చే మెసేజ్‌లు, లింక్‌లను క్లిక్ చేయవద్దు.

* పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ సెట్టింగ్స్ పక్కాగా ఉండేలా చూసుకోవాలి.

* ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లను మార్చుకుంటూ ఉండాలి.

* టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల ఎవరికైనా పాస్‌వర్డ్ తెలిసినా.. ఓటీపీ లేకుండా లాగిన్ కాలేరు.

* సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవేట్ మోడ్‌లో ఉంచడం బెటర్.

* యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్లే స్టోర్, యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* తెలియని నంబర్ల నుంచి వచ్చే ఆడియో, వీడియో కాల్స్‌కు స్పందించవద్దు.

ఫిర్యాదు చేయండిలా

* ఎప్పుడైనా తెలిసీ తెలియక సైబర్ నేరంలో చిక్కుకుంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

* నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.

* 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన మోసం గురించి వివరించాలి.

* సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

* ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయో ఆ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాలి.

ఈ ఏడాది జూన్ వరకు సైబర్ నేరాలు నమోదైన మొదటి 10 రాష్ట్రాలు

రాష్ట్రం                         నేరాలు

మహారాష్ట్ర                  1,60,633

ఉత్తరప్రదేశ్                 1,48,219

కర్ణాటక                     1,02,896

ఢిల్లీ                            89,646

గుజరాత్                     88,383

తమిళనాడు                 80,258

హర్యానా                    66,083

రాజస్థాన్                    65,222

బీహార్                        58,857

తెలంగాణ                   58,176