16-08-2025 01:08:05 AM
2035 నాటికి అందుబాటులోకి అధునాతన ఆయుధ వ్యవస్థ
న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారత్‌ను ఎటువంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్ర అనే అధునాతన ఆయుధ వ్యవస్థను భారత్ అభి వృద్ధి చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రధాని మోదీ దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ‘నయా భారత్’ ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
మోదీ ప్రసంగిస్తూ.. సుదర్శన్ చక్ర దేశంలోని పౌరులను రక్షిస్తుందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో గుణపాఠం చెప్పామన్నారు. భారత్ అణుబాంబు బెదిరింపులకు భయపడదని, సింధూ జలాల ఒప్పందంపై మరో మాటే లేదని స్పష్టం చేశారు.
దేశ యువత కోసం ప్రత్యేకంగా రూ. లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అమలు చేయనున్నామనే తీపి కబురు చెప్పారు. త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా చిప్‌లు తయారు చేయనున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా దీపావళి లోపు జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజలకు కానుక అంది స్తామని పేర్కొన్నారు. వంద ఏండ్లుగా దేశానికి సేవ చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తల అంకిత భావానికి సెల్యూట్ చేశారు.
రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే విధానాలకు గోడలా అడ్డం పడతానని పేర్కొన్నారు. ఆదివాసీల భూములను చొరబాటుదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇక మీదట వారి ఆటలు సాగనీయం అని హెచ్చరించా రు. సముద్రంలో సహజ వనరులు, గ్యాస్, చమురు అన్వేషణకు వీలుగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ అంత రిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లాను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన యా త్ర దేశానికే గర్వకారణం అని తెలిపారు. 2047 (స్వాతంత్య్రం సిద్ధించి 100 సంవత్సరాలు) స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి భారత అణుశక్తిని పది రెట్లు పెంచడమే లక్ష్యమని ప్రకటించారు.
2035 వరకు అందుబాటులోకి..
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన ఆయుధ వ్యవస్థ సుదర్శన చక్ర 2035 నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారు. ‘ఈ ఆయుధ వ్యవస్థ దేశంలోని కీలకమైన ప్రదేశాలను రక్షిస్తుంది. రాబోయే పదేండ్లలో అనేక ముప్పుల నుం చి పూర్తి భద్రతను అందిస్తుంది. శ్రీకృష్ణుని ఆయుధం నుంచి ప్రేరణ పొంది ఈ నిర్ణ యం తీసుకున్నాం. దేశంలో సాంకేతిక అభివృద్ధి విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తోంది.
రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, మతపర ప్రదేశాలన్నింటినీ ఇది రక్షిస్తుంది. ఈ మిషన్‌లో ఖచ్చితమైన లక్షవ్యవస్థ, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. శత్రువుల దా డులను అడ్డుకునేందుకు, శక్తివంతమైన ప్రతీకార ప్రతిస్పందనలు అందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రాబోయే పదేండ్లలో మా రుతున్న యుద్ధస్వభావాన్ని ఎదుర్కోవడానికి బలమైన సుదర్శన చక్ర కవచాన్ని నిర్మిం చేందుకు కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం..
భారతీయ రైతులు, మత్య్సకారుల ప్ర యోజనాలే తమకు ముఖ్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ‘భారతీయ రైతుల ప్రయోజనాలపై ఎప్పటికీ రాజీపడం. మోదీ గోడలా నిలబడి ఉన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటం విపత్తుకు దారి తీస్తుంది. మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి స్వావలంబన కలిగి ఉండాలి.
మేలు రకం ఉత్పత్తులతో, నాణ్యమైన సేవలతో ప్రపంచ మార్కెట్లో మనమేంటో నిరూ పించుకోవాలి. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకుని సత్తా చాటాలి. తక్కువ ధరలో అధిక నాణ్యత వస్తువులు అందించాలి. వ్యాపారులు, దుకాణదా రులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి సారించాలి. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. సందర్భమేదైనా వారికి అండ గా నిలబడతా’ అని స్పష్టం చేశారు.
యువత కొరకు రూ. లక్ష కోట్లు
దేశంలోని యువత కోసం రూ. లక్ష కోట్ల తో కొత్త పథకం రూపొందించినట్టు ప్రధాని పేర్కొన్నారు. రంగమేదైనా స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. స్వయంసమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదని, అమెరికా, బ్రి టన్‌లకు చురకలంటించారు. స్వయం సమృ ద్ధి అంటే సమున్నతంగా నిలబడటం అని పేర్కొన్నారు. ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ఈ పథకం అమలు చే యనున్నాం. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ. 15 వేలు అందించనుంది.
తినే ఆహారం కోసం ఇబ్బం ది పడిన మనం ప్రస్తుతం ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. 2025 చివరి వరకు మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. 21వ శతాబ్దం సాంకేతికతతో కూడు కున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యంత్రాలు ప్రపంచ మార్కెట్లో భారత సత్తా ను చాటాయి. భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోంది. ఎన్నో విషయాల్లో తన సొంత కాళ్లపై నిలబడుతోంది’ అని పేర్కొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులేయాలి
దేశం గ్రీన్ హైడ్రోజన్ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. ‘ఇంధనం విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించాలి. సోలార్, గ్రీన్ హైడ్రోజన్ వైపు దేశం నడవాలి. అణు విద్యుత్‌లో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నాం. డీజిల్, పెట్రోల్ దిగుమతులు తగ్గించాలనేదే లక్ష్యం. ప్రపంచమంతా రేర్ మినరల్స్ చుట్టే తిరుగుతోంది.
ప్రస్తుతం మనం ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు అనేక దేశాలపై ఆధారపడుతున్నాం. మనం ఇంధన స్వాతంత్య్రం సాధించాలి. గత 11 ఏండ్లలో సౌరశక్తి సామర్థ్యం 30 రెట్ల మేర పెరిగింది. ప్రస్తుతం పది కొత్త అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. భారతదేశం 100 ఏండ్ల సాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి అణుసామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ప్రధాని వివరించారు.
భయపడే రోజులు పోయాయి...
బెదిరింపులకు భయపడే రోజులు పోయాయని ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపారు. ‘అణుబాంబు బెదిరింపులను సహించం. మేకిన్ ఇండియా శక్తిని ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పింది. ఉగ్రదాడితో నరమేధం సృష్టించిన వారికి ఆపరేషన్ సిందూర్‌తో బుద్ధి చెప్పాం. పాక్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. మన సైన్యం పాక్‌లోని పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. మన సైనికులు ఊహలకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు’ అని మోదీ తెలిపారు.
‘సింధూ’ నీళ్లపై చర్చల ప్రసక్తే లేదు..
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌కు చెందిన పలువురు అధికారులు, నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధూ జలాల ఒప్పందంపై కూడా ప్రధాని తనదైన శైలిలో స్పందించారు. ‘ఇకపై ఎవరి బెదిరింపులు నడవవు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు.
ఉగ్రవాదులకు సాయం చేసే వారిని వదిలిపెట్టం. బెదిరింపులకు పాల్పడితే ధీటుగా సమాధానమిస్తాం. ఏండ్లుగా అణుబాంబుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. సింధూ నదీ జలాలపై భారత్‌కు సంపూర్ణ హక్కులున్నాయి. ఈ ఒప్పందం వల్ల ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బందులు పడ్డారు. సింధూ నదీ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు’ అని తెలిపారు.
రికార్డు స్థాయి ప్రసంగం..
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని రికార్డు స్థాయిలో 103 నిమిషాల పాటు ప్రసంగించారు. ఎర్రకోట నుంచి వరుసగా 12వ ఏడాది జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. గంటా 43 నిమిషాల పాటు ప్రసంగించారు. 2024లో 98 నిమిషాల పాటు ప్రసంగించి నెలకొల్పిన రికా ర్డు తాజా ప్రసంగంతో కనుమరుగైపోయింది. తొలిసారిగా 2015 స్వాతంత్య వేడుకల సందర్భంగా మోదీ 88 నిమిషాల పాటు ప్రసంగించారు.
అతిథులకు ప్రత్యేక బహుమతులు
ఎర్రకోటలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు హాజరైన వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ‘నయాభారత్’ ఇతివృత్తంతో సాగిన వేడుకల్లో నయా భారత్ అని రాసి ఉన్న జనపనార సంచులు బహూకరించారు. ఈ బ్యాగుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన టవల్, త్రివర్ణ పతాక డిజైన్‌తో టోపీ, రెయిన్ కోట్, వాటర్ బాటిల్ ఉన్నాయి.
సంవత్సరాల వారీగా మోదీ ప్రసంగాలు
2014 65 నిమిషాలు
2015 88 నిమిషాలు
2016 94 నిమిషాలు
2017 56 నిమిషాలు
2018 83 నిమిషాలు
2019 92 నిమిషాలు
2020 90 నిమిషాలు
2021 88 నిమిషాలు
2022 74 నిమిషాలు
2023 90 నిమిషాలు
2024 98 నిమిషాలు
2025 103 నిమిషాలు