calender_icon.png 16 August, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల సాధనే మా అజెండా

16-08-2025 12:48:32 AM

  1. హామీలు దాటి కార్యాచరణ చూపండి
  2. ప్రభుత్వ ఆర్థికభారం వాదన పాత పాటే 
  3. ఉద్యోగుల సంక్షేమం పెట్టుబడే
  4. త్వరలోనే ఐక్య కార్యాచరణను ప్రకటిస్తాం
  5.   42% బీసీ రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం
  6. టీఎన్జీవోల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌తో విజయక్రాంతి ముఖాముఖి

* లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. ఈ కీలక తరుణంలో, ప్రభుత్వానికి, ఉద్యోగ వర్గాలకు మధ్య వారధిగా తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి,ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పాత్ర అత్యంత కీలకం. పే రివిజన్ కమిటీ నివేదిక తక్షణ అమలు, పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం బకాయిల విడుదల, ఉద్యోగ వర్గాలను పట్టిపీడిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు, నిర్వీర్యమైన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రక్షాళన వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వంతో ఆయన జరుపుతున్న చర్చలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశం తర్వాత ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురించినప్పటికీ, ఆచరణలో పురోగతి ఎంత? ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఆయనకున్న విశ్వాసం ఎంత? ఒకవేళ కాలయాపన జరిగితే ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ కీలక అంశాలతో పాటు, ఉద్యోగ ఐక్యతకు సవాలుగా మారిన ప్రమోషన్లలో రిజర్వేషన్ల వివాదం తదితర అంశాలపై ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను మారం జగదీశ్వర్ పంచుకున్నారు.  

- హైదరాబాద్,సిటీబ్యూరో ఆగస్టు 15(విజయక్రాంతి) :

బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రతిపాదనను స్వాగతిస్తున్నారా?

 తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎన్జీవోల సంఘం తరఫున మనస్ఫూర్తిగా, సం పూర్ణంగా స్వాగతిస్తున్నాము. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాష్ర్ట జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయాన్ని స్థాపించడంలో ఒక విప్లవాత్మక అడుగు. జనాభా దా మాషా ప్రకారం బీసీలు అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోతున్నారు. ఈ అసమానతలను తొలగించి, వారిని అభివృద్ధిలో భాగ స్వాములను చేయడానికి రిజర్వేషన్ల పెంపు ఒక శక్తివంతమైన సాధనం.

 ఈ రిజర్వేషన్ల పెంపుదల పదోన్నతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఉద్యోగులలో ఆందోళనలు ఉన్నాయా?

 ఇది చాలా సున్నితమైన అంశం. నియామకాల్లో రిజర్వేషన్ల పెంపును మేమందరం స్వాగతిస్తున్నాము. అయితే పదోన్నతుల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఉద్యోగి సీనియారిటీకి గానీ, వారి అవకాశాలకు గానీ భంగం వాటిల్లకుండా చూ డాలి. దీనిపై ఉద్యోగులలో ఉన్న అపోహలను, ఆందోళనలను తొలగించడానికి ప్రభు త్వం మాతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించాలని కోరు తున్నాము.

 ఉద్యోగుల తక్షణ సమస్యలపై ప్రభుత్వ ప్రాధాన్యత ఎలా ఉండాలి?

 బీసీ రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో, ఉ ద్యోగుల జీవన్మరణ సమస్యలు కూడా అంతే ముఖ్యం. కొత్త పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏలను, బకాయి లతో సహా వెంటనే విడుదల చేయాలి. మా ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారంపై తక్షణమే దృష్టి సారించాలి. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరతాయి.

 ప్రస్తుతం ఉద్యోగులను, పెన్షనర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఏమిటి?

 మా ముందున్న అతిపెద్ద, తక్షణ కర్తవ్యం రెండవ పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయించడం. మధ్యంతర భృతితో కాలం గడపడం ఉద్యోగులకు ఇబ్బందిగా ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి. దీంతో పాటు గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఇది పెన్షనర్ల ఆరోగ్య ఖర్చులకు ఎంతో అవసరం. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం పూర్తిగా విఫలమైంది. ఈ మూడు అంశాలను ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలుగా వివరించాం.

 సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?

 సీపీఎస్ రద్దు అనేది మా ఉద్యోగుల జీవన్మరణ సమస్య. 30-,35 ఏళ్లు సేవ చేసి, పదవీ విరమణ తర్వాత భద్రత లేని జీవితం గడపాలంటే ఎలా? ఇది మా హక్కు, ఆత్మగౌరవ సమస్య. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓపీఎస్‌కు అనుకూలంగా ఉంది. తెలంగాణలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేశాం. దీనిపై ఉన్న ఆర్థిక, న్యాయపరమైన చిక్కులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓపీఎస్ సాధించే వరకు మా పోరాటం ఆగదు.

 ఒకవేళ ప్రభుత్వం కాలయాపన చేస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది?

 మేం ప్రభుత్వానికి సహేతుకమైన సమయం ఇస్తున్నాం. కానీ ఉద్యోగుల సహనం అనంతం కాదు. జాప్యం జరిగితే, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తాం. ముందుగా అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నల్ల బ్యాడ్జీలతో నిరసన, భోజన విరామ ప్రదర్శనల నుంచి అవసరమైతే సమ్మె వరకు వెళ్లడానికైనా వెనుకాడం.

  బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం గట్టిగా మాట్లాడటం, ఇతర సామాజిక వర్గాలను దూరం చేయడం కాదా? ఇది మీ నాయకత్వానికి సవాలు కాదా?

 ఈ రెండింటినీ వేర్వేరుగా చూడాలి. ఉద్యోగులందరి ఉమ్మడి ఆర్థిక హక్కుల కోసం పోరాడటం నా ప్రాథమిక బాధ్యత. అదే సమయంలో, అణచివేతకు గురైన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం అందాలని కోరడం నా నైతిక బాధ్యత. ఒకటి ఉద్యోగ హక్కు, మరొకటి సామాజిక హక్కు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు అంటే, ఇతరుల హక్కులను కాలరాయమని కాదు, రాజ్యాంగబద్ధమైన వాటాను మాకు ఇవ్వమని మాత్రమే.

 పీఆర్సీ, డీఏ వంటి డిమాండ్ల కోసం, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఒక ఒత్తిడి వ్యూహంగా వాడుతున్నారనే ఆరోపణలో నిజమెంత?

 ఇది అత్యంత దురదృష్టకరమైన ఆరోపణ. ఉద్యోగుల కడుపునకు సంబంధించిన సమస్యను, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యతో ముడిపెట్టడం సరైంది కాదు. బీసీ ఉద్యోగుల హక్కుల కోసం నేను దశాబ్దాలుగా పోరాడుతున్నాను. రెండూ మాకు ముఖ్యమైనవే. ఒకదాని కోసం మరొకదాన్ని బలిపెట్టే ప్రసక్తే లేదు.

ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని ప్రభుత్వం చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు?

 ఇది పాలకుల నుంచి మాకు దశాబ్దాలుగా వినిపిస్తున్న పాచిపోయిన పాటే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని “భారం”గా చూడటమే అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేది ఉద్యోగులే. వారి సంక్షేమానికి చేసే ఖర్చును పెట్టుబడిగా చూడాలి. ఉద్యోగి సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయి. అనవసరపు ఖర్చులకు, ఆర్భాటాలకు వందల, వేల కోట్లు ఉంటాయి కానీ, ఉద్యోగుల న్యాయమైన హక్కుల విషయానికి వచ్చేసరికి ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం సమంజసం కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి, వనరులను సరిగ్గా సమీకరిస్తే పీఆర్సీ, ఓపీఎస్ అమలు అసాధ్యమేమీ కాదు. ఉద్యోగులు కూడా ఈ రాష్ర్ట పౌరులే, పన్నులు కడుతున్నవారే. వారి చెమటతో నిండిన ఖజానా నుంచే మా హక్కులను అడుగుతున్నాం.

ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా బీసీ ఉద్యోగులకు మీరిచ్చే సందేశం ఏమిటి?

  ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలి. కులం, మతం పేరుతో మన మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది బీసీలకు దక్కుతున్న న్యాయమైన హక్కు. దీనికి మనమందరం మద్దతుగా నిలవాలి. అదే సమయంలో, మనందరి ఉమ్మడి సమస్యలైన పీఆర్‌సీ, డీఏ, ఓపీఎస్ వంటి వాటిపై కూడా ఐక్యంగా పోరాడాలి. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం.

 సీఎంతో సమావేశంలో కేవలం హామీలే లభించాయా, లేక ఏదైనా నిర్దిష్టమైన కాలపరిమితిపై స్పష్టత వచ్చిందా?

 సమావేశం సామరస్యపూర్వకంగా జరిగింది. పీఆర్సీ నివేదికపై అధ్యయనం చేసి, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలతో ఒక ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. డీఏల బకాయిల విడుదలకు ఆర్థిక వనరులను సమకూర్చాలని ఆర్థిక శాఖకు సూచిస్తామన్నారు. కచ్చితమైన తేదీ చెప్పకపోయినా, అనవసరమైన జాప్యం ఉండదని, త్వరలోనే శుభవార్త వింటారని భరోసా ఇచ్చారు. మేం ఆ మాటను విశ్వసిస్తున్నాం, కానీ అదే సమయంలో కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాం.

ఉద్యోగ సంఘాల మధ్య పూర్తిస్థాయి ఐక్యత ఉందా? అందరినీ ఒకే వేదికపైకి ఎలా తీసుకువస్తారు?

 ఉద్యోగులందరి లక్ష్యం ఒక్కటే.. హక్కుల సాధన. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజం. కానీ పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్ వంటి ప్రధాన సమస్యల విషయంలో మేమంతా ఒక్కటే. జేఏసీ చైర్మన్‌గా నేను అన్ని సంఘాలను కలుపుకొని వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే అన్ని సంఘాలతో సమావేశమై ఐక్య కార్యాచరణను ప్రకటిస్తాం.

 జేఏసీలో అన్ని సంఘాలనూ కలుపుకొని ఉమ్మడి పోరాటానికి హామీ ఇవ్వగలరా?

 గతం గతః. గతాన్ని తవ్వుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కొన్ని విమర్శలు ఉండొచ్చు, వాటిని నేను కాదనను. కానీ ప్రస్తుతం ఉద్యోగులందరూ ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైనవి. ఇప్పుడు వ్యక్తిగత అజెండాలకు, సంఘాల మధ్య పోటీకి తావులేదు. పీఆర్సీ, డీఏ, ఓపీఎస్ అనేవి ప్రతి ఒక్క ఉద్యోగి సమస్య. ఈ విషయంలో భేదాభిప్రాయాలకు ఆస్కారమే లేదు. జేఏసీ చైర్మన్‌గా, అన్ని సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ఉద్యోగుల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేస్తామని నేను పూర్తి భరోసా ఇస్తున్నాను. మా ఐక్యతే మా బలం, దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా తిప్పికొడతాం.