16-08-2025 12:53:52 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో చివరి ఆయకట్టు వర కు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడబోం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధి ంచేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసి నా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం.
దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్య త తెలంగాణ ప్రజలపై ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
‘రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ద్విముఖ విధా నంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. మా ఆలోచనలో స్పష్టత ఉంది. అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలు పుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని ఎంచుకున్నాం’ అని సీఎం తెలిపారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట లో జాతీయ జెండాను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే సామాజిక న్యాయం ఉందన్నారు. స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నామని, సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టామని తెలిపారు.
అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని సీఎం కోరారు. దేశంలో ఎస్సీ వర్గీకర ణను అమలు చేసింది తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
సన్న బియ్యంతో పేదల కళ్లలో ఆనందం చూశా
‘2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ర్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కర ణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కులగణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం.
ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం. ఇవి అత్యంత సాహసోపేత నిర్ణయాలు. ఒకవైపు ప్రపంచ నగరా లతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి ‘సన్న బియ్యం’ పంపిణీని ప్రారంభించింది. రూ.13 వేల కోట్ల వ్య యంతో, 3.10 కోట్ల మందికి సన్నబి య్యం అందిస్తున్నాం.
ఈ రోజు ధనికుల తో సమానంగా పేదలు సన్న బియ్యంతో భోజ నం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే ప థకం. ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వ తంగా గుర్తుంటుంది’ అని సీఎం పేర్కొన్నారు.
రేషన్‌కార్డు ఆత్మగౌరవానికి ప్రతీక
‘రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా, భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ర్ట ప్రజలు 10 ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజాప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించా’మని ఆయన చెప్పారు.
‘రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విధంగానే 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేశాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకంతో ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం కింద కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల ఖాతాల్లో వేశాం. 70,11,184 మంది రైతులకు ఈ సాయం అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం.
7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. అన్నదాతల సంక్షేమానికి రూ.1.13 లక్ష కోట్లు ఖర్చు చేశాం.
ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. రాష్ర్టంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం’ అని సీఎం తెలిపారు.
‘ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుంచి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,700 కోట్ల వ్యయంతో నయా ఉస్మాని యా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ర్టంలో అనేక చోట్ల వైద్యవిద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. వైద్యారోగ్య రం గంపై రూ. 16,521 కోట్లు వెచ్చిస్తున్నాం. ఆర్టీసీలో మహిలకు ఉచిత ప్రయాణం కల్పించ డంతో.. ఆడబిడ్డలకు రూ.6,790 కోట్లు ఆ దా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికె ట్ల మైలురాయిని దాటడం మా విజయాల లో మరో మైలురాయి.
రాష్ర్టంలో ఆడబి డ్డ ల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభు త్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది’ అని తెలిపారు. ‘గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వా ళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరి స్తున్నాం. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ర్టం మూలమూలలా నిశితంగా నిఘా పె ట్టింది. డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
హైదరాబాద్‌ను రక్షించే గొప్ప వ్యవస్థ హైడ్రా
‘హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బెంగళూరు, ముంబై, చెన్ను లాంటి నగరాల దుస్థితి హైదరాబాద్‌కు రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువ చ్చాం. ఇటీవలే ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను అక్రమణల నుంచి రక్షించింది.
అంబర్‌పేట బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి పక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పనిచేస్తోంది. హై డ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది. హైడ్రా... హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ’ అని అన్నారు.
యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు నాకు రెండు కళ్లు..
‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ రెండూ నాకు రెండు కళ్లు. తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్డడంలో ఈ వ్యవస్థలు అద్వితీయ పాత్ర పోషిస్తాయి. మన పిల్లల భవితకు ఇవి కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతున్నాయి. దేశ క్రీడా చరిత్రలో తెలంగాణకు ప్రత్యేక చాప్టర్ ఉంది. తెలంగాణను దేశ క్రీడా మైదానంగా తీర్చిదిద్దే బాధ్యత మేం తీసుకున్నాం.
క్రీడా కారులను తయారు చేసి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాల సాధనే లక్ష్యంగా ఇటీవలే నూతన క్రీడా పాలసీని ఆవిష్కరించాం’ అని సీఎం తెలిపారు. అదే సమయంలో విద్య, నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా స్కూళ్లు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. సకల వర్గాల విద్యార్థులు చదువుకునేలా యంగ్ ఇండియా స్కూళ్లు సిద్ధం అవుతున్నాయని తెలిపారు. రూ.15,600 కోట్ల వ్యయంతో 78 పాఠశాలల నిర్మాణం జరుగుతోందని, విద్యా రంగం అభివృద్ధికి రూ. 39,575 కోట్ల ఖర్చు చేశామన్నారు.
శాంతిభద్రతలు రాష్ర్ట ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయని, దేశంలోనే ది బెస్ట్ అని తెలంగాణ పోలీసులకు పేరుందన్నారు. 138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమిట్’ (డబ్ల్యూపీఎస్) 2025లో, డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకాణమన్నారు.
డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్
‘మాకు విల్ ఉంది. విజన్ ఉంది. హైదరాబాద్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్‌లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. ఇటీవల 72వ ప్రపంచసుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దీంతో మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగింది . దేశంలోనే మొదటిసారి గత ఏడాది హైదరాబాద్‌లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సు నిర్వహించాం.
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. గ్లోబల్ రైస్ సమ్మిట్‌ను కూడా మనం హైదరాబాద్‌లో నిర్వహించుకున్నాం. మన ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్ -2025ను హైదరాబాద్‌లో నిర్వహించి తెలంగాణ విజన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం.
అదే “తెలంగాణ రైజింగ్ - 2047”. వచ్చే డిసెంబర్‌లో ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నాం’ అని సీఎం వివరించారు. ‘2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్-2047.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే కార్యక్రం తీసుకున్నాం. ఇది ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.. తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ’ అని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఉటుందని తెలిపారు.
వారసత్వంగా రూ. 8 లక్షల కోట్ల అప్పులు
‘మేము అధికారం చేపట్టే నాటి కి గత పాలకులు మాకు వారసత్వం గా రూ.8,21,651 కోట్ల అప్పులు బకాయిలుగా మిగిల్చి వెళ్లారు. దీ నిలో రూ.6,71,757 కోట్ల అప్పులు. ఉద్యోగులు, ఇతర పథకాలకు సం బంధించిన బకాయిలు రూ.40,154 కోట్లు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 1,09, 740 కోట్లు. గత అప్పులు రూ.1,32, 498 కోట్లు, వడ్డీలకు రూ.88,178 కోట్లు మొత్తం కలిపి 2 లక్షల 20 వే ల 676 కోట్లు డెట్ సర్వీసింగ్ చేశాం’ అని సీఎం వివరించారు.