19-05-2025 05:23:25 PM
ఉట్నూర్ (విజయక్రాంతి): భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్య తీసుకోవాలని ఉట్నూరు బీజేపీ మండల శాఖ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఉట్నూర్ ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉట్నూర్ మండల బీజేపీ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ... భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంలో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పడం జరిగిందన్నారు.
మనదేశ భద్రత కొరకు ఎంతవరకైనా తెగిస్తామని చెప్పడం ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే, మరి కాంగ్రెస్ నాయకులు మన దేశంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు అన్నారు. ఒక భారతదేశ ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసే స్థాయి మీది కాదని చెప్పి, ఈరోజు ఎవరైతే నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేరి రమేష్, సిపతి లింగాగౌడ్, బాణావత్ జితేందర్, పందిరి భీమన్న ఉన్నారు.