ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డికి పోలీస్ మెడల్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందజేత
కరీంనగర్, ఆగస్టు 15(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుముల నిరంజన్ రెడ్డికి విశిష్టమైన పోలీస్ సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. నిరంజన్ రెడ్డి 1989లో కానిస్టేబుల్‌గా చేరి, కరీంనగర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేశారు. 1990 జనవరిలో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా తొలి పోస్టింగ్ పొందారు.
అప్పటి నుంచి తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ఎదురుకాల్పుల్లో విధులు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రత్నారెడ్డి, తక్కువ సర్వీస్ కాలంలోనే ఆయనకు పదోన్నతి కల్పించారు.
1992లో స్వగ్రామమైన వరంగల్ జిల్లాకు వెళ్తున్న సమయంలో సుమారు 20 మంది మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నిరంజన్ రెడ్డికి, ఆయనతో పాటు పనిచేసిన కానిస్టేబుల్ శంకర్‌కు గాయాలయ్యాయి.అయినప్పటికీ మావోయిస్టులను ఎదుర్కొంటూ ఎదురు కాల్పులు జరిపి ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం కూడా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భయపడకుండా విధులు నిర్వహించారు.ఆయన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలను గుర్తిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సేవా పతకం, అనంతరం ముఖ్యమంత్రి ఉత్తమ సేవా పతకంతో సత్కరించింది.






