23-01-2026 12:00:00 AM
నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య
నల్లగొండ టౌన్, జనవరి 22: సీఎం రేవంత్‌రెడ్డి అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నల్లగొండ లో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మారలేదు, భాష మారలేదన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి సామాన్య ప్రజలే కాదు ఆ పార్టీ నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి తీరుతో విసుగు చెందిపోయారని, పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి రాత్రి మోడీ, చంద్రబాబు లతో చీకటి ఒప్పందాలు చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆగడాలను, తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎక్కడిక్కడా బిఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉందన్నారు.
ప్రజాక్షేత్రంలో అరాచక కాంగ్రెస్ పార్టీకి బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు చుక్కలు చూపిస్తున్నారని, బొగ్గు కుంభకోణం, కాంగ్రెస్ పార్టీ స్కాంలను ఎండగట్టినందుకే హరీష్ రావుపై అక్రమ కేసు బనయించేందుకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా సిగ్గులేని రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ విచారణ అంటూ హరీష్ రావుని ఇబ్బందులు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ వస్తేనే కెసిఆర్ గారిపై కాళేశ్వరం కేసు, కెటిఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసు, హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.
హరీష్ రావుమాట్లాడిన విషయంలో ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదని, ఇన్నిసార్లు నల్లగొండ జిల్లాకు వచ్చిన ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం, ధనం, పోలీసు యంత్రాంగంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుందని, సీనియర్ కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల ఫోన్లను రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నాడని ఆరోపించారు. అధికారులు పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలానే వ్యవహరిస్తున్నారని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడిస్తోందన్నారు.
కోదాడలో దళితబిడ్డ కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారకులయ్యారని, వెంటనే విచారణ జరపాలని, అందుకు బాధ్యత వహించి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణగదొక్కుతుందని ఆరోపించారు. నకిరేకల్ లో స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక, మట్టి రవాణా యదేచ్ఛగా చేస్తున్నాడని, ప్రశ్నించిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ దుర్భసలాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ పాతాళంలో కలిపి మళ్ళీ తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా వ్యూహం రచించారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి తరాల బలరాం యాదవ్, అశోక్ రెడ్డి, సైదులు పాల్గొన్నారు.