12-10-2025 08:03:05 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ (విజయక్రాంతి): ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరు బాధ్యత అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరంలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే కార్యక్రమం నిర్వహించిన ప్రతిసారి పోలియో చుక్కలు వేయించాలన్నారు.
1995 నుండి మనదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో దాదాపు 150 పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారని కావున ఆ పరిధిలోని పిల్లలందరినీ తీసుకురావడం కేవలం అధికారుల బాధ్యత అనుకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి వీధిలోని ప్రతి ఇంటిలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు సుమారు 85,000 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకుగాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆరోగ్య ఉపకేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో 472 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈరోజు వేయించుకోని పిల్లల కోసం రేపటినుండి రెండు రోజులు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా మహిళా సమాఖ్య, నర్సింగ్ విద్యార్థులు, మున్సిపల్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 1995 నుంచి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని అన్నారు.
పోలియో వచ్చినట్లయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని, కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి బాలింతలతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని, అలాగే అక్కడ తల్లికి బిడ్డకు అందుతున్న వైద్య సేవలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాసరావు, డాక్టర్ ప్రసాద్, అశోక్ లు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పలు పల్స్ పోలియో కేంద్రాలను సందర్శించి కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. అప్పయ్య, రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి,అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, ట్రై సిటిస్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ గీత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.