12-10-2025 10:24:35 PM
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలనే నిర్ణయం ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలి..
సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ డిమాండ్..
పెన్ పహాడ్: శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన దీర్ఘకాల ప్రజా పోరాటాల ఫలితమని, ఆ ప్రాజెక్టుకు మాజీ ఎంపీ, కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును పెట్టాలని సిపిఎం సీనియర్ నాయకుడు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం అయన మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ రెండో దశకు పెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టు కోసం ఎన్నో దశాబ్దాలుగా వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ పోరాటం చేసినట్లు రణపంగ కృష్ణ గుర్తు చేశారు.
ఆ పోరాటంలో మాజీ ఎంపీగా భీమిరెడ్డి నరసింహారెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన త్యాగాలను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. వామపక్షాల పోరాటం ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి శ్రీరామ్ సాగర్ రెండో దశ(ఎస్.ఆర్.ఎస్.పీ) ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. అంతేకాదు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెడతామని గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదని రణపంగ కృష్ణ విమర్శించారు. ఇప్పుడు ఆర్డీఆర్ సంతాప సభలో ఈ శ్రీరామ్ సాగర్ రెండో దశకు దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయాలను కోవడం సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిదిలా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం వెనుకకు తీసుకోక పోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.