12-10-2025 10:31:10 PM
స్థానికం నుంచి చట్ట సభల వరకు సత్తా చాటాలి
'పద్మశాలీ దసరా మేళా’ లో ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపు
‘హరిణ వనస్థలి’లో ఘనంగా ఎల్బీనగర్ సర్కిల్ 23వ మేళా
ఎల్బీనగర్: పద్మశాలీలు అన్ని రంగాలతో పాటు రాజకీయంగా ఎదగాలని, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చట్ట సభల వరకు అన్నింట్లో మన సత్తా చాటాలని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు ఎల్. రమణ పిలుపునిచ్చారు. ఆదివారం ఆటోనగర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ‘ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలీ సంఘం ’ఆధ్వర్యంలో 23వ పద్మశాలీ దసరా మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సభావేదికపై ఏర్పాటు చేసిన మార్కండేయుడికి నమస్కరించి, పద్మశాళీ పెద్దలను సన్మానించారు. అనంతరం రమణ మాట్లాడుతూ.. పద్మశాలీ దసరా మేళాను గత 23 ఏండ్లుగా విజయవంతంగా నిర్వహిస్తూ.. దేశ విదేశాల్లో ఉండే పద్మశాలీలకు ఆదర్శంగా నిలుస్తున్న నిర్వాహకుల కృషి , పట్టుదల అభినందనీయమన్నారు.
ఇదే పట్టుదలతో పద్మశాలీలు రాజకీయంగా చైతన్యమై రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో రాబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వస్తుండడంతో పద్మశాళీ మహిళలు చట్టసభల్లోకి వెళ్లే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలన్నారు. ఎవరి జనాభా ఎంత ఉందో జనాభాకు అనుగుణంగా అన్నిరంగాల్లో పద్మశాలీలు ఎదగాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు ఎల్బీనగర్ ప్రాంతంలో పరిమితంగా ఉండే పద్మశాలీ సంఘం నేడు తెలంగాణ మాత్రమే కాకుండా విదేశాలు కూడా ఎల్బీనగర్ దసరామేళాకు హాజరు కావాలనే విధంగా ఏటికేడు గొప్పగా నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు.
ప్రస్తుతం చేనేత రంగంలో మిగిలిపోయిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను మనందరం కలిసికట్టుగా ఉండి.. పరిష్కరిద్దామని రమణ పిలుపునిచ్చారు. నేతన్నల ఆత్మహత్యల నివారణకు వారికి ఆత్మస్థైర్యం కలిగే విధంగా , ఆత్మాభిమానంతో తోటి వారితో సమానంగా జీవించే విధంగా అండగా నిలుద్దామన్నారు. అందులో నేను కూడా మీతో కలసి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేళా కమిటీ చైర్మన్ పున్న గణేశ్, అధ్యక్షుడు కౌకుంట్ల రవితేజ, గడ్డం లక్ష్మీనారాయణతో పాట కార్యవర్గ సభ్యులు, పద్మశాలీ ప్రముఖులు జెల్లా మార్కండేయ, యరమాద వెంకన్న నేత తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అలరించిన గుండేటి రమేశ్ మాట.. పాట..
దసరా మేళాలో కరీంనగర్‌కు చెందిన గుండేటి రమేశ్ తన కళాబృందంతో మాట.. పాటలతో అలరించారు. పద్మశాలీల చారిత్రక గొప్పదనాన్ని కళ్లకు కట్టినట్లు తన పాటల రూపంలో వివరించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన వివిధ రంగాలకు చెందిన స్టాళ్లు, మ్యారేజ్ బ్యూరోలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. పద్మశాలీ మహిళలు భారీ సంఖ్యలో జమగూడి బతుకమ్మ ఆడారు.