12-10-2025 10:45:24 PM
మంత్రి వివేక్ వెంకటస్వామి తీరు ఆపేక్షణీయం..
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హెచ్చరిక..
ఎల్బీనగర్: ఆర్యవైశ్యుల్లో అమరవాది లక్ష్మీనారాయణ విభజన తెస్తున్నారని, ఇందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి సహకరిస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆర్య వైశ్యుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ సమావేశం మిడిదొడ్డి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ లోని ఒక ప్రవేట్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆర్యవైశ్య మహాసభను భ్రష్టు పట్టించిన వ్యక్తికి, వైశ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న అమరవాది లక్ష్మీనారాయణను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మంత్రి హోదాలో అమరవాది లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లి ఏమైనా పదవి ఇప్పించే ప్రయత్నం చేస్తే ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురికాక తప్పదని కల్వ సుజాత హెచ్చరించారు.
అమరావాది లక్ష్మీనారాయణను అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తే ఆర్య వైశ్యులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఆర్య వైశ మహాసభ పేరు చెప్పుకొని నియంతృత్వంగా వ్యవహరిస్తున్న అమరవాది లక్ష్మీనారాయణపై ఆర్య వైశ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ మహాసభ భవన్ ను అమరవాది లక్ష్మీనారాయణ సెటిల్మెంట్ కు అడ్డాగా మార్చుకున్నారని, బూతు బంగ్లా లాగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాలుగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవిని అనుభవిస్తున్న అమరవాది లక్ష్మీనారాయణ ఆటలు ఇక సాగవని ఆర్యవైశ్యుల హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభ పేరుతో అమరవాది లక్ష్మీనారాయణ చేసిన అవినీతి, అక్రమ బాగోతలు అన్నీ బయటకు తీస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.