20-10-2025 02:09:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులకు ఇంకా మావోయిస్టులతో లింక్‌లు ఉన్నాయని, వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారని, ఇటీవలే సరెండర్ అయిన నక్సలైట్లు వెల్లడించారని, ఇది చాలా సీరియస్ విషయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలన్నారు.
పోలీసుల ప్రా ణాలను బలిగొన్న నక్సలిజాన్ని ఎవరూ ప్రోత్సహించరని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్‌పటేల్ యూనిటీ మార్చ్ రాష్ర్టస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో “నక్సలిజం నిర్మూలించడం కష్టం” అనే పరిస్థితి ఉండగా, నేటి హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మాట దాదాపు నిలబెట్టుకున్నారని తెలిపారు.
అమిత్‌షా ఈ తరం సర్దార్ పటేల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. ఆయన కఠినమైన నిర్ణయాలతో దేశం అంతటా శాంతి స్థాపన సాధించారని చెప్పారు. దేశ ఏకత్వం కోసం సర్దార్ పటేల్ చేసిన త్యాగం భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని, “ఏక్ భారత్- ఆత్మనిర్భర్ భారత్”... కేవలం ప్రభుత్వమే కాదు, ప్రతి పౌరుడు పాల్గొనాల్సిన జాతీయ ఉద్యమమన్నారు. ఆయన కృషి వల్లే తెలంగాణ భారతదేశంలో భాగమైందన్నారు.
చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం కోసం కొన్ని పార్టీలు సత్యాన్ని దాచిపెట్టినా, బీజేపీ మాత్రం నిజమైన చరిత్రను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే పేర్లతో దేశాన్ని విభజించాలనుకునే ఎవరి కుట్రలూ విజయం సాధించవని, దేశ ఏకత్వాన్ని కాపాడేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి మంచి అవకాశాలన్నారు. తెలంగాణలో కాంగ్రె స్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రజలను మోసం చేసిందని, ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.