20-10-2025 01:15:01 AM
వెనుకబడిన వర్గాలకు అండగా గులాబీ శ్రేణులు
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. ఆ పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ. అయితే.. అప్పటి పేరు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్). ఇప్పుడది బీఆర్‌ఎస్. స్వరాష్ట్ర సాధన కోసం పార్టీ ప్రజలను ముందుండి నడిపించింది. చివరకు ప్రజల కలలు నెరవేరి స్వరాష్ట్ర కల సాకారమైంది. ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి అప్రతిహతంగా పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్నా ళ్లు ఆటుపోట్లు ఎదుర్కొన్న గులాబీ శ్రేణు లు తాజాగా బీసీ కోటా ఉద్యమం తెరమీదకు వచ్చిన తర్వాత మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నది. బీసీలు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తున్న ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించి వచ్చే ఎన్నికల్లో విజ యానికి బాటలు వేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థుల సమస్యలు, కోల్పోతున్న నదీ జలాల హక్కుల వైఫల్యాలను తిరిగి ప్రజలకు వివరించాలని, తద్వారా మళ్లీ ప్రజల మద్దతు కూడగట్టే దిశగా అడుగులు వేస్తున్నది. కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాకుండా ఉద్యమాల రూపంలో తిరిగి ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను రూపొందిస్తుంది. తద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తున్నది.
నాడు స్వరాష్ట్ర, నేడు బీసీ ఉద్యమం..
నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి టీఆర్‌ఎస్ (ప్రసుతం బీఆర్‌ఎస్) ఆవిర్భావానికి కారణమైంది. ప్రజల ఆశ లు, ఆత్మగౌరవం, స్వపరిపాలన అనే నినాదాలతో ప్రారంభమైన ఆ ఉద్యమం ఒక పార్టీని మాత్రమే కాకుండా, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ అధికారానికి దూరమైనా, ప్రజాఉద్యమాల ద్వారా మళ్లీ ప్రజల నాడిని తాకే ప్రయత్నం చేస్తోంది. దానికి బీసీ ఉద్య మం వేదిక కానున్నది. బీసీ ఉద్యమం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చైతన్యాన్ని తీసుకొస్తున్నది.
రిజర్వేషన్, ప్రాతినిధ్యం, కుల గణన వంటి అంశాలపై బీసీ వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తి ఒక కొత్త సామాజిక శక్తిగా రూపుదిద్దుకుంటోంది. ఈ పరిణామాలను సానుకూల దిశగా మల్చుచుకునే అవకాశం ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ వచ్చింది. గతంలో ఉద్యమాలను ముందుండి నడిపించిన అనుభవం బీఆర్‌ఎస్ పార్టీకి ఒక మార్గదర్శకంలా ఉపయోగపడుతుంది. నాడు తెలంగాణ కోసం చేసిన పోరాటం ద్వారా రాష్ట్ర ప్రజలను బీఆర్‌ఎస్ ఏకం చేసింది. ఇప్పుడు బీసీల హక్కుల కోసం ఉద్యమం కూడా అదే వైఖరిని అవలంబించనున్నది.
కాంగ్రెస్, బీజేపీ విఫలం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టాక బీసీ కోటా అమలుకు బిల్లు చేసింది. ఆ చట్ట సవరణ చేయడంలో బీజేపీ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నది. కోటా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని బీసీలు భావిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనలో గందరగోళం, నిబంధనల అమలులో తడబాటు, రాజకీయ ప్రాతినిధ్యంలో నిర్లక్ష్యం.. బీసీ వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చింది.
ఆ రెండు పార్టీలకు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. మళ్లీ రాజకీయంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షాల వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గాల అసంతృప్తిని మద్దతుగా మార్చడం, ప్రజా సమస్యలను తన ప్రత్యేక గుర్తింపుగా ప్రజల ముందుకు తీసుకురావడమే ప్రధాన వ్యూహంగా అడుగులు వేస్తుంది.
పెరిగిన విశ్వసనీయత..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేదనే అభిప్రాయం ప్రజానీకంలో ఉంది. ఈ అభిప్రాయం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నది. రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్‌ఎస్ బీసీ రిజర్వేషన్ల అమలుకు పలు ప్రయత్నాలు చేసింది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపింది. తర్వాత పరిణామాల్లో కోటా అమలు పెండింగ్‌లో పడింది. ఆ పార్టీ మొదటి నుంచీ బీసీలకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక ప్రాతినిధ్యం కల్పించడం, బీసీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం వంటి నిర్ణయాలు బీసీల్లో ఆ పార్టీకి విశ్వసనీయతను పెంచాయి.
మరో అవకాశం..
బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చాక రాష్ట్రంలో మరోసారి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కులగణన, రిజర్వేషన్ పరిమితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి నేపథ్యంలో బీసీ సమాజం తిరిగి బీఆర్‌ఎస్ వైపు చూడే అవకాశాలు పెరుగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను బీఆర్‌ఎస్ కొత్త ఆయుధాలుగా మార్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
గతంలో బీసీలకు ప్రత్యేక గుర్తింపు, పథకాలు, రాజకీయ అవకాశాలు ఇచ్చిన పార్టీగా బీఆర్‌ఎస్ తన బలాన్ని మళ్లీ గుర్తు చేయాలనే యత్నంలో ఉంది. బీసీ ఉద్యమం ఇప్పుడు కేవలం సామాజిక డిమాండ్ మాత్రమే కాకుండా బీఆర్‌ఎస్ రాజకీయ పునరుద్ధరణకు దారితీయగల అవకాశంగా మారింది. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ అధికారం సాధించడమే లక్ష్యం..
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ప్రస్తుతం ఒక స్పష్టమైన వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. కేవలం ఎన్నికల సమయం మాత్రమే కాకుండా ప్రజా సమస్యలను పట్టించుకుని, పరిష్కారానికి గళమెత్తడం, సామాజిక ఉద్యమాలను పార్టీ బలంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రజల ఆవేదనను సానుకూలంగా మార్చుకుంటూ మళ్లీ ప్రజల మద్దతు పొందే అవకాశాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది.
దీంతోపాటు పాలక పక్షాల వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం, అన్ని వర్గాల అసంతృప్తి బీఆర్‌ఎస్‌కు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతున్నాయి. ప్రజాఉద్యమాల నుంచి వచ్చిన సామాజిక చైతన్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, కేడర్‌ను ఉత్సాహపరిచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు గులాబీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి.